ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా మహమ్మారిని సహితం లెక్క చేయకుండా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేడు హై కోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. స్వయంగా రాష్త్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రాష్ట్ర హై కోర్ట్ ముందు ఇప్పట్లో రాజధాని తరలింపు చేయబోమని హామీ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.
రాజధానిని విశాఖపట్నంకు తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని అంటూ వైసిపి ఎంపీ వి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వాఖ్యాలను హై కోర్ట్ తీవ్రంగా పరిగణించడంతో ఈ విధమైన భరోసా ఇవ్వవలసి వచ్చింది. రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో వేసిన ప్రజావాయిజా పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ పరిణామం జరిగింది.
ఒక వంక ఈ అంశం హైకోర్టు పరిశీలనలో ఉండగానే రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దానితో రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు పాస్ అవ్వకుండా రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజీ హైకోర్టుకు హామీ ఇచ్చారు.
ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రమాణపత్రం దాఖలుకు 10 రోజుల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో హైకోర్టు 10 రోజుల గడువిచ్చింది.
కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది.