IND Vs PAK disney hot star: మార్పునిత్యం. మార్పు సత్యం. మార్పు శాశ్వతం. ఒకప్పుడు కొత్తది అనుకున్నదే తర్వాత పాతది కావచ్చు. ఆ పాత దాన్ని స్థానాన్ని మరో కొత్తది ఆక్రమించవచ్చు. మనిషి మెదడు ఆవిష్కరణల వైపు సాగుతున్న కొద్దీ నవీనత అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం అవుతుంది. ఒకప్పుడు సినిమా అంటే గుడారాలే! తర్వాత టూరింగ్ టాకీసులు వచ్చాయి. వాటి స్థానాన్ని సినిమా థియేటర్లు ఆక్రమించాయి. ఆ తర్వాత 70mm స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లు, ఇప్పుడు త్రీడీ థియేటర్లు.. మున్ముందు ఇంకెన్ని మార్పులు చూస్తామో.. అలాగే ఒకప్పుడు మాట్లాడుకోవాలంటే ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి. తర్వాత బిఎస్ఎన్ఎల్ తరంగ్ లు వచ్చాయి. కొద్ది కాలానికి కాయిన్ బాక్స్ ఫోన్లు వచ్చాయి. సాంకేతికత పెరిగి బ్లాక్ అండ్ వైట్ నోకియా ఫోన్ల నుంచి నేడు 5జి ఫోన్ల దాకా పరిణామ క్రమం పెరిగింది. ఫోన్ అంటే ఇప్పుడు అర్థం పూర్తిగా మారిపోయింది. కేవలం మాట్లాడుకోవడమే కాదు.. ఎప్పుడు వర్షం పడుతుంది, పది అడుగులు నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి, కనుచూపుమేరలో ఎక్కడ హోటళ్ళు ఉన్నాయి? ఇలా ఒక్కటేమిటి సమస్తం ఇప్పుడు డిజిటల్ మాయమే. మున్ముందు మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేయగలిగే సత్తా ఈ డిజిటల్ శకానికి ఉంది. ఒకప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు డిజిటల్ విభాగాన్ని చిన్నచూపు చూసేవారు. కానీ నేడు అది లక్షల కోట్ల మార్కెట్ అయ్యింది.
-డిస్నీ స్టారా మజాకా
అక్షరాల కోటిన్నర మంది.. ఇంకా లోతుల్లోకి వెళ్తే అది మూడు కోట్లు కావచ్చు.. నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ టి20 మ్యాచ్ ను అక్షరాల కోటిన్నర మంది కళ్ళు అప్పగించి చూశారు. ఒక్కో ఫోన్ ను ఇద్దరు చూశారనుకున్నా.. ఈ లెక్క మూడు కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు అంటే క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే రేడియో కామెంట్రీ, తర్వాత దూరదర్శన్, మరి కొద్ది రోజుల తర్వాత సాటిలైట్ ఛానల్ ప్రసారాలు.. ఇప్పుడు ఏకంగా ఫోన్లోనే చూసే సౌలభ్యం.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత సౌకర్యాలు పూర్తి మార్పులు వచ్చాయి. గృహిణులు కూడా టీవీలకే అతుక్కుపోకుండా సెల్ఫోన్లలో సీరియళ్ళను చూస్తున్నారు. సెల్ ఫోన్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ టీవీలు చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది.
మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఓటీటీలు వినోద కేంద్రాలుగా మారాయి. ప్రస్తుతం అనేక బహుళ జాతి సంస్థలు ఓటీటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయి. డిజిటల్ మార్కెట్ అంతకంతకు విస్తరిస్తోంది కాబట్టే కళ్ళు బైర్లు కమ్మేలా వ్యాపారం సాగుతోంది. 2024-27 కాలానికి ఇండియాలో ఐసీసీ క్రికెట్ మ్యాచ్ ల టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను, (ఐపీఎల్ కాకుండా) డిస్నీ+ హాట్ స్టార్ ఏకంగా 24 వేల కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ప్రసారాలకు సంబంధించి బిసిసిఐ ఓపెన్ బిడ్లను ఆహ్వానించినప్పుడు ముఖేష్ అంబానీ కూడా ఎంటర్ అయ్యాడు. ఈ డిజిటల్ ప్రసారాల మార్కెట్ స్టామినా తెలుసు కాబట్టి డిస్నీ+ హాట్ స్టార్ 24 వేల కోట్లకు ప్రసారాలను దక్కించుకుంది. ఒకవేళ కనుక ముఖేష్ అంబానీ పూర్తిస్థాయిలో ఇందులోకి దిగితే కథ మరింత రంజుగా ఉండేది.
తెలుగు మార్కెట్ విషయానికొస్తే ప్రతి ఛానల్ కు ఒక ఓటీటీ ఉంది. స్టార్ మాకు డిస్నీ +హాట్ స్టార్, జీ తెలుగు జీ ఫైవ్, ఈటీవీ కి ఈటీవీ విన్.. ఇప్పుడు ఈ ఓటీటీల ద్వారా వివిధ కార్యక్రమాలను చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న ఆహా ఓటీటీ లో టీవీ9 ప్రసారాలను కూడా వీక్షించవచ్చు. మున్ముందు మిగతా ఓటీటీలు కూడా ఇదే బాట పట్టినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అంతెందుకు నిన్నటికి నిన్న పాకిస్తాన్ తో జరిగిన టి20 ఆసియా కప్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ను, మరి ముఖ్యంగా చివర్లో అతడు బాదిన ఒక సిక్సర్ ను కోటిన్నర మంది చూశారని డిస్నీ+ హాట్ స్టార్ పేర్కొంది. అంటే డిజిటల్ యుగం ఎంత దూసుకుపోతుందో చెప్పేందుకు ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.
ఇండియా జనాభా 130 కోట్లు. ఇందులో నిన్న డిస్నీ హాట్ స్టార్ చూసింది కోటిన్నర మంది. ఒక స్ట్రీమింగ్ ను ఇద్దరు చూశారని లెక్కేసుకున్నా మూడు కోట్లు ఉంటుంది. అదేం చిన్న సంఖ్య కాదు. దీన్ని మెల్లగా ఆరు శాతం వరకు తీసుకెళ్లినా చాలు సదరు ఓటీటీ పంట పండినట్టే! అయితే ఓటిటీ ఎదుగుదల చూసి ఓర్వలేక, నాణ్యమైన సినిమాలు తీసే సత్తా లేని దిల్ రాజు లాంటి నిర్మాతలు ఓటిటిలో సినిమా విడుదలను రెండు నెలల దాకా ఆపుతామంటున్నారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది నిర్మాతే. ఎందుకంటే కరోనా కాలంలో నిర్మాతలను ఆదుకుంది ఓటీటీలే. అవే గనక లేకుంటే ఈపాటికి చాలామంది నిర్మాతలు సినిమా రంగాన్ని వదిలేసి వెళ్లిపోయేవారు. ఏ లెక్కన చూసుకున్నా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం బహుళ జాతి ఓటీటీ సంస్థలకు ఇప్పుడు కామధేనువు. దిల్ రాజు, కరణ్ జోహార్.. ఇలాంటి సినీ ఉద్దండులు ఎంత ఆపాలని చూస్తే అంత ఎదుగుతుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs pakistan match breaks all records on disney hot star
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com