politics of the state: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు గురించే తీవ్రమైన చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఐదు మండలాల సమూహంగా ఉన్న ఈ నియోజకవర్గం లో సీఎం కేసీఆర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక్క రోజు వ్యవధిలో పర్యటించడం ఇక్కడి రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. మొన్నటిదాకా టిఆర్ఎస్, బిజెపి మధ్య పోటీ ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ హఠాత్తుగా కాంగ్రెస్ కూడా సీన్లోకి రావడంతో పోటీ అనేది ముక్కోణంగా మారిపోయింది. ఈ క్రమంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా రాజకీయ నాయకులు వదులుకోవడం లేదు. డబ్బు పంపకం, బహుమతుల పంపిణీ, రాయబేరాలు, బుజ్జగింపులు ఇప్పుడు మునుగోడులో సర్వసాధారణం అయిపోయాయి. ఐదు మండలాల పరిధిలో ఏ గ్రామంలో చూసినా ఏదో ఒక పార్టీ సమావేశం జరుగుతూనే ఉంది. ఖరీదైన కార్లు, ఖద్దరు తొడిగిన నేతల పర్యటనలతో మునుగోడు ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంది. ఎన్ని సమావేశాలు నిర్వహించినా, ఏ స్థాయిలో ప్రలోభాలకు గురిచేసినా అంతిమంగా ఓటరు మహాశయుడు ఓటు వేస్తేనే పార్టీ అభ్యర్థులు గెలుస్తారు కాబట్టి.. ఇంతకీ మునుగోడులో ఏ పార్టీ ఎలా ఉంది? ఓటర్లు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం బలంగా ఉంది?
Also Read: Seediri AppalaRaju: గోల్డెన్ చాన్స్ వస్తే… మిస్ చేసుకుంటున్న మంత్రి
బీసీ లే ఎక్కువ
మునుగోడు నియోజకవర్గంలో గౌడ, ముదిరాజ్, పద్మశాలి కులస్తులు ఎక్కువ. వీరు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుస్తుంది. మునుగోడులో మొత్తం ఓటర్లు 2,20,520 కాగా.. ఇందులో మెజార్టీ గౌడ కులస్థులు 35150 (15.94 శాతం) ఉన్నారు. ఆ తర్వాత ముదిరాజ్ లు 33900 (15.37 శాతం), ఎస్సీ మాదిగలు 25650, యాదవ 21360, పద్మశాలీలు 11680 మంది ఉన్నారు. మిగతా ఎస్టీ లంబాడా 10520, ఎస్సీ మాల 10350లు పదివేలకు పైగా జనాభాతో శాసించే స్థితిలో ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికలు ఇదే విషయాన్ని నిరూపించాయి. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ ర్గాలు అండగా నిలవడంతో ఆయన టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడించగలిగారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ వర్గాలకు ఆయన అండగా ఉంటున్నారు. పైగా ఈ కులస్తులు నిర్మించుకున్న సంఘాలకు ఇతోధికంగా సహాయం చేశారు. కొన్ని విషయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచర వర్గం హడావుడి చేయడంతో ఈ సామాజిక వర్గాలు కొంత ఇబ్బంది పడ్డాయి. అయితే ఈ విషయంలో నష్ట నివారణ చర్యలకు రాజగోపాల్ రెడ్డి దిగకపోవడంతో ఆ సామాజిక వర్గాల్లోని కీలక నేతలు ఆయనతో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ప్రస్తుతం బుజ్జగింపులు జరుగుతున్నా అవి ఆశించినంత మేర ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.
Also Read: Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ సడన్ టూర్ ఎందుకు? అసలేం జరుగుతోంది?
టిఆర్ఎస్ పరిస్థితి కూడా ఇంతే
2014లో మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. పూర్తి వ్యవసాయ ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పంట భూములకు నీరు పారేందుకు సరైన కాలువలు లేవు. ఫ్లోరైడ్ నిర్మూలించగలిగామని టిఆర్ఎస్ చెప్తున్నా ఆ ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. ఎందుకంటే ఫ్లోరైడ్ రహిత తాగునీటి ప్రాజెక్టు ప్రారంభమైంది ఆ ప్రభుత్వం హయాంలో కాబట్టి. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ హామీలు అమలు చేయకపోవడంతో ఈ ప్రాంతంలో ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. దళిత బంధు యూనిట్ల మంజూరులో కూడా అధికార టీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో మిగతా వారిలో అసంతృప్తి నెలకొంది. ప్రభాకర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు చూడడం మానేశారు. దీంతో ఆయనకు, నియోజకవర్గానికి చాలా గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక టిఆర్ఎస్ నేతలే ఒప్పుకోవడం లేదు. కెసిఆర్ మాత్రం ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఇక్కడ మెజార్టీ ఓటర్లైన బిసి కులాలు ప్రభాకర్ రెడ్డి పై అంత ఆసక్తి చూపడం లేదు. ఆ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో కేడర్‌లో డైలమా ఏర్పడింది.
అడకత్తెరలో పోక చెక్కలా కాంగ్రెస్
కాంగ్రెస్ కి బలమైన ఓటు బ్యాంకు ఉన్నా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోలేక పోతోంది. ఇప్పటికే కీలక నేతలు బిజెపి, టీఆర్ఎస్లో చేరారు. ఎవరు పోటీ చేస్తారనే విషయంపై పార్టీ నాయకత్వం ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. పైగా టిఆర్ఎస్ సీఎం కేసీఆర్ ను తీసుకొచ్చి భారీ సమావేశం నిర్వహించింది. బిజెపి అమిత్ షా తో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసింది. సహజంగానే ఈ రెండు సమావేశాలు ఆయా పార్టీల కేడర్‌లో ఉత్సాహం నింపాయి. ప్రజలకు కూడా పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉంటుందన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. రేసులో టిఆర్ఎస్, బిజెపి క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమలో తాము పోట్లాడుకుంటున్నారు. అందు గురించే సీఎం కేసీఆర్ మొన్నటి మునుగోడు సభలో కాంగ్రెస్ నాయకుల తీరును “గొర్రె గొతికె” తో పోల్చారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉండటం ఆ పార్టీ నాయకులకు కలిసి వచ్చే అంశం. అయితే ఎన్నికల తేదీ ఖరారు కాకపోయినప్పటికీ మునుగోడులో రాజకీయ నేతల ప్రచారం మాత్రం తారస్థాయిలో ఉంటోంది. ముక్కోణపు పోటీలా కనిపిస్తున్నా.. రేసులో మాత్రం టిఆర్ఎస్, బిజెపి కొంత యాక్టివ్ గా కనిపిస్తుండటం గమనార్హం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: In the past there was a struggle between the kula and the kula
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com