అనుకున్నంత పని చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హెచ్1బీ వీసాల ఎంపిక విధానంలో కొత్త సవరణలు తీసుకురానుంది అమెరికా ప్రభుత్వం. ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనుంది. తద్వారా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు హెచ్1బీ జారీకి ఇప్పటి వరకు అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు తెలిపింది. వేతనాలు, నైపుణ్యస్థాయిల ఆధారంగా వీసాలు జారీ చేసేలా కొత్త రూల్స్ అమలు చేయాలని అధికారంలోకి రానున్న జోబైడెన్ భావిస్తున్నారు. హెచ్1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో మార్పులు తీసుకువస్తున్నట్లు యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ మేరకు వెల్లడించింది.
Also Read: ట్రంప్ నకు షాకిచ్చిన ట్విట్టర్.. శాశ్వత నిషేధం
అమెరికా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు కేవలం ఎంతో నైపుణ్యం ఉన్న విదేశీ వర్కర్లే ఈ వీసాల వల్ల ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఈ మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ఇందుకు సంబంధించిన తుది నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేస్తారు. అనంతరం 60 రోజుల్లోనే ఇది అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మళ్లీ హెచ్1బీ వీసా ఫైలింగ్ సీజన్ ప్రారంభమవుతుంది.
హెచ్1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ఏటా వేలాది మంది విదేశీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఇండియా, చైనా నుంచి ఏటా వేలాది హెచ్1బీ వీసాలు జారీ అవుతాయి. వీసా జారీ ప్రక్రియ మార్పు వల్ల కంపెనీలు మరింత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను భారీగా వేతనాలు చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఏడాది జారీ చేసే హెచ్1బీ వీసాలపై అమెరికా పరిమితి విధించింది. యూఎస్‌సీఐఎస్ ఏడాదికి గరిష్ఠంగా 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ స్టెమ్ సబ్జెక్టుల్లో అమెరికా యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు అదనంగా 20 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. హెచ్1బీ వీసాలో తాజా మార్పుల ద్వారా ఉద్యోగులకు ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు వీలు చిక్కనుంది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Also Read: మహా చెడ్డ పాలకుడిగా ముద్ర పడిన ట్రంప్
భారత్, చైనా తదితర దేశాల నుండి ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తాయి. అధిక వేతనాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రస్తుత లాటరీ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఎంపికలో కంపెనీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఎంపిక చేసుకోవచ్చు.
మరో రెండు వారాల్లో ట్రంప్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ నోటిఫికేషన్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పులు భారతీయ కంపెనీలపై చూపే ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం జో బైడెన్ హెచ్-1బీ వీసా నిబంధనలపై సమీక్షించే అవకాశాలున్నాయి. హెచ్-1బీ వీసాలతోపాటు ఇతర వర్క్ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగిస్తూ గతవారం ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు