Cancer Day
Cancer Day : ప్రపంచ ఆరోగ్య రంగాన్ని కుదిపేసే వ్యాధి క్యాన్సర్. ప్రతి సంవత్సరం, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ప్రమాదకరమైన వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక క్యాన్సర్ కేసులు చైనాలో ఉన్నాయని తేలింది. ఇక్కడ 48 లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారట. ఇక ఈ జాబితాలో రెండవ స్థానాన్ని సంపాదించింది అమెరికా. ఇక్కడ దాదాపు 23 లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారట. ఈ జాబితాలో భారతదేశం 14 లక్షల కేసులతో మూడవ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 97 లక్షలు.
క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ప్రధాన లక్ష్యం క్యాన్సర్ నుంచి ప్రజలను రక్షించడమే. అంతేకాదు మరణాలను తగ్గించడం కూడా ఈ లక్ష్యమే అంటున్నారు అధికారులు. ఈ సందర్భంగా జన్యు క్యాన్సర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ లాంటి వ్యాధితో చనిపోతే, ఇతరులకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? అటువంటి సందర్భంలో, ఏ పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా?
ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించే వ్యాధులు చాలా ఉన్నాయి. అంటే, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులతో కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే, ఈ వ్యాధి రెండవ తరానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. కానీ క్యాన్సర్ విషయంలో అలా ఉంటుందా? అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఈ ప్రశ్నకు వైద్యులు అవును అనే సమాధానం చెబుతున్నారు.
కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు కూడా దాని బాధితులుగా మారవచ్చట. అయితే, తరం నుంచి తరానికి క్యాన్సర్ సంక్రమించే కేసులు కేవలం 10 శాతం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించదు. అయితే, జన్యు పరివర్తన దీనికి కారణం కావచ్చు. తల్లిదండ్రుల అండంలో లేదా శుక్రకణంలో క్యాన్సర్ కణాలు ఉంటే అది పిల్లలకు కూడా సంక్రమించవచ్చని నిపుణులు అంటున్నారు.
క్యాన్సర్ పరీక్ష ఎలా చేయించుకోవాలి?
క్యాన్సర్‌ను గుర్తించడానికి బయాప్సీ పరీక్ష అత్యంత ప్రభావవంతమైనది. ఈ సమయంలో, వైద్యుడు మన శరీరంలోని క్యాన్సర్ లక్షణాలు కనిపించే కణాల నుంచి కొన్ని కణజాలాలను తీసివేసి పరీక్ష కోసం పంపిస్తారు. ఈ పరీక్ష క్యాన్సర్ కణజాలాలను, క్యాన్సర్ కాని కణజాలాలను వేరు చేస్తుంది.