First aid guidelines: రోడ్డు ప్రమాదం, ఎత్తు నుంచి పడిపోవడం లేదా తీవ్రమైన గాయాల తర్వాత బాధితుడు ‘దాహంగా ఉంది.. నీళ్లు ఇవ్వండి’అని అడిగినా.. వెంటనే నీరు ఇవ్వొద్దని వైద్యులు సూచిస్తుంటారు. దీనికి ముఖ్యమైన కారణం ప్రాణాపాయం పెరగకుండా చూడటమే. గాయపడిన వ్యక్తి బయటకు సాధారణంగానే కనిపించినా, లోపల తీవ్రమైన గాయాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నీళ్లు తాగించడం వల్ల కొన్ని ప్రమాదకరమైన సమస్యలు తలెత్తవచ్చు. అసలు ఈ సమయంలో నీరు ఎందుకుఇవ్వొద్దు..?ఇస్తేఏం జరుగుతుంది?
స్పృహ సరిగా లేకపోతే ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం
ప్రమాదం తర్వాత కొంతమందికి తలకు దెబ్బ తగిలి స్పృహ పూర్తిగా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నీరు తాగిస్తే అది అన్నవాహికలోకి వెళ్లాల్సింది బదులు శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనినే ‘ఆస్పిరేషన్’ అంటారు. ఇలా నీరు ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా శ్వాస ఆడకపోవడం వంటి ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు.
లోపలి గాయాలు ఉంటే పరిస్థితి మరింత క్లిష్టం
ప్రమాదాల తర్వాత కడుపు, పేగులు లేదా ఇతర అంతర్గత అవయవాలకు గాయాలు కావచ్చు. బయటకు కనిపించకపోయినా లోపల రక్తస్రావం జరుగుతుండవచ్చు. అటువంటి పరిస్థితిలో నీళ్లు తాగడం వల్ల వాంతులు, అసౌకర్యం పెరగవచ్చు. అలాగే వైద్యులు గాయాల తీవ్రతను అంచనా వేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.
అత్యవసర శస్త్రచికిత్స అవసరమైతే సమస్య
ప్రమాద బాధితుడికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. శస్త్రచికిత్సకు ముందు సాధారణంగా కడుపు ఖాళీగా ఉండాలని వైద్యులు కోరుతారు. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చిన సమయంలో కడుపులో ఉన్న నీరు లేదా ఆహారం తిరిగి గొంతులోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీస్తుంది.
షాక్‌లో ఉన్నప్పుడు నీరు పరిష్కారం కాదు
తీవ్ర రక్తస్రావం వల్ల కొందరు ‘షాక్’ స్థితిలోకి వెళ్తారు. ఈ సమయంలో వారికి దాహం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ నీళ్లు తాగించడం వల్ల రక్తపోటు లేదా రక్తనష్టం సమస్యలు సరిచేయలేవు. ఆసుపత్రిలో వైద్యులు అవసరమైతే సలైన్, ఐవీ ద్రావణాలు లేదా రక్తం ద్వారా చికిత్స అందిస్తారు.
ఫస్ట్ ఎయిడ్‌లో ఏం చేయాలి?
ప్రమాద బాధితుడికి స్పృహ సరిగా ఉందో లేదో ముందుగా పరిశీలించాలి. శ్వాస తీసుకుంటున్నాడో లేదో చూడాలి. మెడ లేదా వెన్నెముకకు గాయమై ఉండొచ్చని అనుమానం ఉంటే కదిలించకూడదు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలి. బాధితుడి పెదవులు ఎండిపోతే కొద్దిగా తడి గుడ్డతో తుడవొచ్చు కానీ నేరుగా నీరు తాగించకపోవడం మంచిది.
