Vitiligo Symptoms and Treatment: కొన్ని ఆహారపు అలవాట్లతో చర్మ సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చేపలు తిన్న తరువాత పాలు తాగితే చర్మం తెల్ల మచ్చలు ఏర్పడుతాయని చెబుతారు. అయితే ఇవి కేవలం అలాంటి ఆహారం మాత్రమే తీసుకుంటే రాదు.శరీరంలోని మార్పులు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే వీటిని Vitiligo అని అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. మన చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్ కణాలు దెబ్బతినడం లేదా నాశనం కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో చర్మంలోని కొన్ని ప్రాంతాలు తమ సహజ రంగును కోల్పోయి తెల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది రావడానికి అసలు కారణాలు ఏవి?
విటిలిగో రావడానికి ఖచ్చితమైన ఒకే కారణం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ సమస్యగా పరిగణించబడుతోంది. అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడి, కొన్ని రసాయనాల ప్రభావం, చర్మ గాయాలు లేదా ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా దీనికి కారణమవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఈ వ్యాధి ప్రారంభ దశలో చిన్న తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి క్రమంగా పెద్దవిగా మారవచ్చు లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా ముఖం, చేతులు, కాళ్లు, పెదవుల చుట్టూ, కళ్ల చుట్టూ, వేళ్ల వద్ద ఎక్కువగా కనిపిస్తాయి. కొందరిలో తల వెంట్రుకలు, కనుబొమ్మలు లేదా గడ్డం వెంట్రుకలు కూడా తెల్లబడవచ్చు.
ఇది అంటు వ్యాధేనా?
విటిలిగో గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది అంటువ్యాధి అని కొందరు భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. విటిలిగో ఒక అంటువ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా లేదా ఇతర మార్గాల్లో ఇది వ్యాపించదు. కాబట్టి విటిలిగో ఉన్నవారిని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు.
పూర్తిగా నివారించగలమా?
విటిలిగోను పూర్తిగా నివారించే నిర్దిష్ట మార్గం ప్రస్తుతం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడిని తగ్గించడం, చర్మాన్ని గాయాల నుంచి కాపాడుకోవడం, హానికర రసాయనాల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
సూర్యరశ్మి నుంచి రక్షణ అవసరం
విటిలిగో ఉన్న ప్రాంతాల్లో మెలనిన్ తక్కువగా ఉండటం వల్ల చర్మం సూర్యరశ్మికి ఎక్కువగా సున్నితంగా మారుతుంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం, టోపీ లేదా పూర్తి చేతుల దుస్తులు ధరించడం మంచిది. ఇది చర్మాన్ని రక్షించడమే కాకుండా మచ్చలు మరింత స్పష్టంగా కనిపించకుండా కూడా సహాయపడుతుంది.
ఎలాంటి సమయంలో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి?
చర్మంపై అకస్మాత్తుగా తెల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభమైతే వెంటనే చర్మవ్యాధి నిపుణుడు (డెర్మటాలజిస్ట్)ను సంప్రదించాలి. మచ్చలు వేగంగా వ్యాపిస్తున్నా, వెంట్రుకలు తెల్లబడుతున్నా లేదా శరీరంలోని అనేక ప్రాంతాల్లో మార్పులు కనిపిస్తున్నా వైద్య సలహా అవసరం. ప్రారంభ దశలో చికిత్స ప్రారంభిస్తే వ్యాధి వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
