
అగ్నికి ఆయువు తోడైతే వినాశనం సృష్టిస్తుంది. పట్టుదలకు ప్రోత్సాహంతో తోడైనా అభివృద్ధితో వికసిస్తుంది. ఒక యువ సర్పంచ్.. అతడికి తోడుగా మరో యువ పంచాయతీ కార్యదర్శి కలిశారు. గ్రామం కోసం ఏకమయ్యారు. నిధులు, విధులు గుర్తించారు. పట్టుదలు, కోపతాపాలు, పంతాలు, పట్టింపులు ఊరికోసం పక్కనపెట్టారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగారు. ఫలితం ఆ ఊరు రూపు రేఖలే మారాయి. దరిద్రం ఆమడ దూరం పారిపోయింది.
కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారని అందరూ అంటారు. కానీ కృషిని నమ్ముకున్న ఆ గ్రామ సర్పంచ్ అద్భుతమే చేశాడు. ఊరిని ఎవ్వరూ ఊహించని విధంగా మార్పులు చేశాడు. చిన్న గ్రామ పంచాయతీ అయినా ఊరికోసం సొంతగా కోట్లు ఖర్చు పెట్టి బాగు చేశాడు. అధికారులు, ప్రజా ప్రతినిధులంతా ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చేశాడు. ఔరా అనిపించేలా గ్రామాన్ని తీర్చిదిద్దాడు.
కులాలు, కొట్లాటలు, నిధుల కేటాయింపులు, పంతాలు అంటూ కొట్టుకునే ఊళ్లను చూస్తున్న ఈరోజుల్లో ఆ యువ సర్పంచ్ కు తోడుగా ఆ గ్రామస్థులంతా కలిసి ముందుకు సాగిన తీరు ఓ అద్భుతమనే చెప్పాలి. అందుకే ఇప్పుడు అందరూ కలిసి ఆ గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా నిలిపారు. కృషి చేస్తే ఆ ఊరు బాగుపడుతుందని.. పట్టుదలతో చేస్తే సకల సమస్యలు తీరుతాయని నిరూపించారు.
-ఏంటా ఊరు.. ఎక్కడుంది?
ఎక్కడో అడవుల జిల్లా.. రాష్ట్రానికి ఒక మూలకు ఉంటుంది. అయినా కూడా అభివృద్ధిలో తామేమీ తక్కువ కాదని నిరూపించింది. ఉమ్మడి నిర్మల్ లోని భైంసా మండలం కథ్ గాం గ్రామంలో ఇప్పుడు అదే జరిగింది. ఇదివరకు హస్గుల్ గ్రామ పంచాయతీకి అనుబంధం గ్రామంగా ఉన్న కథ్ గాం ఉండేది. 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన గ్రామపంచాయతీల్లోకొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. గ్రామ సర్పంచ్ గా యువకుడైన ‘దెగ్లూర్ రాజు’ ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీకి ఆరుగురు గ్రామ వార్డు సభ్యులున్నారు. గ్రామ జనాభా 720 ఉండగా.. అందులో ఓటర్లు 347 మంది ఉన్నారు.
*ఊరికి తోడుగా సర్పంచ్ రాజు. పంచాయతీ కార్యదర్శి జాదవ్
ఇద్దరూ యువకులే.. పట్టుదలతో పంతం పట్టారు. ఊరికోసం నడుం బిగించారు. సర్పంచ్ రాజు, కార్యదర్శి జాదవ్ లు ఇద్దరూ అభివృద్ధి కోసం పాటు పడ్డాటు. గ్రామాన్ని ప్రగతి బాటలో పయనింపచేశారు. వీరి చొరవకు.. స్ఫూర్తికి గ్రామ పెద్దలు, యువకులు పాలకవర్గానికి పూర్తి స్థాయిలో సహకరించారు. దీంతో కథ్ గాం ఊరు కథ మారింది.. కథ్ గామ్ లో ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవారికి.. గ్రామస్థులకు అందేలా వీరిద్దరూ చేశారు. హరితహారం గ్రామంలో పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వడంతో పచ్చదనంతో ఊరు పరిఢవిల్లుతోంది. ప్రకృతివనం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉట్టిపడుతోంది. పారిశుద్యం నిర్వహణ వ్యవస్థపై వీరిద్దరూ ప్రత్యేక దృష్టి పెట్టారు. రోజూ ట్రాక్టర్ తో చెత్త సేకరించి ప్రజలను రోగాలు, జబ్బుల నుంచి కాపాడారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ గ్రామ పంచాయతీలో తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మి కంపోస్టుగా తయారు చేస్తున్నారు.సంబంధిత వర్మి కంపోస్టు ఎరువును గ్రామంలో కూరగాయాలు, ఇంటి వద్ద చెట్లు పెంచుతున్న వారికి ఉచితంగా అందిస్తున్నారు.
-ఊరు రూపురేఖలు మార్చారు
పల్లె ప్రగతి నిధుల ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేశారు. గ్రామంలోని పలు రోడ్ల గ్రావేలింగ్ చేపట్టారు. పశువుల తాగునీటి కోసం తొట్టి నిర్మించారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం సక్రమంగా పనిచేసేలా పంచాయతీ పాలక వర్గం పాటుపడుతోంది. రూ.13 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. రూ.3 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ, పాఠశాలలో పార్క్ ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. ఇంటింటికి నల్లా ద్వారా మిషన్ భగీరథ నీటి సరఫరా చేశారు. భైంసా నుంచి కథ్ గాం వరకు ఎవెన్యూ ప్లాంటేషన్ లో రోడ్డుకు ఇరువైపులా మొక్కులు నాటి పచ్చని ప్రకృతిని సృష్టించారు.భూగర్భ జలాల పెంపు కోసం ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం కూడా చేపట్టారు.
-సర్పంచ్ రాజు పెద్దమనుసు.. రూ.1.2 కోట్ల విరాళం
సర్పంచ్ గా గెలవగానే ఎంత లోపల వేద్దామనుకునే వారే ఉంటారు. కానీ నిస్వార్థంతో కథ్ గాం సర్పంచ్ రాజు మాత్రం తన ఆస్తులు అమ్మి ఊరు బాగు కోసం ఖర్చు చేసిన తీరు ప్రశంసలు కురిపిసి్తోంది. గ్రామంలో పాండురంగ స్వామి, మహాదేవ్ మందిరాల నిర్మాణం కోసం గాను గ్రామ సర్పంచ్ దెగ్లూర్ రాజు తండ్రి లాలన్న రూ.1.2 కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా అందించారు. అంతేకాకుండా వైకుంఠదామం నిర్మాణం కోసం రూ.7లక్షల విలువ చేసే స్థలాన్ని విరాళంగా అందించారు. పల్లె ప్రకృతి వనం, గోదాంల నిర్మాణం కోసం ఖుర్షీద్ రూ.70 లక్షలు విలువ చేసే ఎకరం స్థలాన్ని విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నారు. గ్రామస్థుల ఆర్థిక సహకారంతో రూ.25 లక్షలతో కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు.
-ఆక్షరాస్యత కోసం అలుపెరగని పోరాటం
గ్రామంలో అక్షరాస్యత కోసం అలుపెరగని పోరాటమే చేశాడు సర్పంచ్ రాజు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గ్రామ పరిసర ప్రాంతంలో గల వేదం తపోవన్ పాఠశాల విద్యార్థుల సహాయ సహకారాలతో గ్రామంలోని ప్రతి ఒక్కరికి చదువు నేర్పించేందుకు గాను ఇంటింటికి ‘ఇచ్ వన్ టీచ్ వన్’ పేరిట అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇలా అన్నిరంగాల్లోనూ గ్రామం కోసం తన సర్వశక్తులు, ఆర్థిక వనరులు దారపోసి ఒక గొప్ప ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో సర్పంచ్ రాజు నిరూపించాడు. అతడి ఉదారత ఇప్పుగు కథ్ గాం గ్రామ రూపురేఖలే మార్చేశాయి. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, నిస్వార్థంతో చేసే వ్యక్తి ఉంటే ఇలాంటి గ్రామాలన్నీ ప్రగతి పథాన నడుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.