మనలో చాలామంది పాటలు వినడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇయర్ ఫోన్స్ ను అతిగా వినియోగించడం వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే ఇయర్ ఫోన్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ను ఎంచుకుని ఉద్యోగాలు చేసేవాళ్లు, ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యే వాళ్లు ఎక్కువగా ఇయర్ ఫోన్స్ ను వినియోగిస్తున్నారు.
అయితే వైద్య నిపుణులు తరచూ ఇయర్ ఫోన్స్ ను వినియోగించే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే చెవి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముంబైకు చెందిన జేజే గవర్నమెంట్ ఆస్పత్రి వైద్యులు గతంతో పోలిస్తే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి చెవి సంబంధిత సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లే ఆస్పత్రులకు వస్తున్నారని తెలిపారు.
సాధారణంగా చెవి సంబంధిత సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారితో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం ఎక్కువమంది చెవిసంబంధిత సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారని గంటల తరబడి ఇయర్ ఫోన్స్ వస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఏవైనా చెవి సంబంధిత సమస్యలు ఉన్నట్టు అనిపిస్తే ఇయర్ ఫోన్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచనలు చేశారు.
60 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఇయర్ ఫోన్స్ ద్వారా వినకూడదని వెల్లడించారు. పిల్లలకు ఇయర్ ఫోన్స్ వినియోగం గురించి తల్లిదండ్రులు సూచనలు చేయాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఇయర్ ఫోన్స్ ను అతిగా వినియోగించడం వల్ల శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశం ఉంది.