Swiggy : స్విగ్గి.. మనదేశంలో ప్రస్తుతం 600 నగరాలలో సేవలు అందిస్తోంది. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తోంది.. రెస్టారెంట్లు, హోటళ్ళతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని.. వినియోగదారులకు కోరుకున్న ఆహారాన్ని క్షణాల్లో అందిస్తోంది. కేవలం ఆన్లైన్ ఫుడ్ మాత్రమే కాదు, ఇన్ స్టా మార్ట్ పేరుతో వేగవంతంగా సరుకులను కూడా రవాణా చేస్తోంది.. అయితే స్విగ్గి ఈ స్థాయికి ఎదగడం ఒక్కరోజులో సాధ్యం కాలేదు. దీని వెనక ఎంతో శ్రమ ఉంది. మరింత కష్టం దాగి ఉంది. ఇంతటి ప్రయాణాన్ని స్విగ్గి వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీహర్ష మాజేటి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. స్విగ్గి ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన తమ తొలి ప్రయాణాన్ని వెల్లడించారు..
2014లో ప్రారంభం..
” బెంగళూరు కేంద్రంగా 2014 ఆగస్టు 6 న మేం స్విగ్గి సంస్థను మొదలుపెట్టాం. మొదటి ఫుడ్ ఆర్డర్ కోసం కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూసాం. అయితే మాకు ఆరోజు ఒక ఆర్డర్ కూడా రాలేదు. తర్వాతి రోజు ఆర్డర్ వచ్చింది. మేము భాగస్వామ్యం ఏర్పరచుకున్న ట్రపుల్స్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ కోసం మాకు రెండు ఆర్డర్లు లభించాయి. ఇక అప్పటినుంచి ఆ హోటల్ తో మేము మా బంధాన్ని బలోపేతం చేసుకున్నాం. ఒకానొక దశలో మాకు 7,261 ఆర్డర్ల దాకా వచ్చాయి. వాస్తవానికి అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్ విస్తృతమవుతోంది. అలాంటి సందర్భంలోనే మాకు ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. దానిని విస్తృతం చేసేందుకు చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ ప్రయాణం మాకు చాలా జ్ఞాపకాలు ఇచ్చింది. సంస్థను అభివృద్ధి చేయడానికి చాలా కష్టాలు పడ్డాం. ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాపై నమ్మకం ఉంచిన కస్టమర్లు, రెస్టారెంట్లు, హోటళ్ల వల్ల ఈ స్థాయిలో విజయం సాధించగలిగామని” శ్రీ హర్ష పేర్కొన్నారు.
మూడు లక్షల రెస్టారెంట్లతో కలిసి పని
ప్రస్తుతం స్విగ్గి సంస్థ దేశంలోని మూడు లక్షల రెస్టారెంట్లతో కలిసి పని చేస్తోంది. వేలాది మంది ఉద్యోగులు స్విగ్గిలో పనిచేస్తున్నారు. వెజ్ – నాన్ వెజ్ కేటగిరీలతో ప్రత్యేకంగా స్విగ్గి ఫుడ్ సప్లై చేస్తోంది. అందువల్లే స్విగ్గి సంస్థ ఈ స్థాయిలో మన్నన పొందింది. దేశంలో ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు నుంచి స్విగ్గి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అక్కడి నుంచి వెనక్కి చూసుకోకుండా అంతకంతకూ విస్తరించింది. మెట్రో నగరాలు, టైర్ -1 సిటీస్, టైర్ -2 సిటీస్ కు కూడా విస్తరించింది..ఫుడ్ రవాణాలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. టైర్ -3 సిటీలకు కూడా విస్తరించేందుకు స్విగ్గి ప్రణాళికలు రూపొందిస్తోంది.. అంతేకాకుండా మెట్రో నగరాలలో ప్రత్యేకమైన రెస్టారెంట్లు నిర్మించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇక ఇవి మాత్రమే కాకుండా, పేరుపొందిన రెస్టారెంట్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.. స్విగ్గి సీఈవో చేసిన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది.. ఇలాంటి సానుకూల దృక్పథాన్ని కలిగించే అంశాలు యువతలో సరికొత్త ఆలోచనను కలగజేస్తాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.