
దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు. అయితే టైప్ 1 మధుమేహం ముప్పు పొంచి ఉన్నవారు మధుమేహం బారిన పడకుండా టెప్లిజుమాబ్ అనే మందు తోడ్పడుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. తగినంత ఇన్సులిన్ లేకపోవడం లేదా ఇన్సులిన్ అసలే ఉత్పత్తి కాకపోవడం వల్ల టైప్ 1 మధుమేహం తలెత్తుతుంది. పిల్లల్లో ఎక్కువగా టైప్ 1 డయాబెటిస్ వస్తుంది.
వయస్సుతో సంబంధం లేకుండా టైప్ 1 డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెద్దవారిలో అరుదుగా మాత్రమే టైప్ 1 డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో టైప్ 1 డయాబెటిస్ సమస్య ఉంటే ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ డయాబెటిస్ ఉంటే ఈ ముప్పు మరింత ఎక్కువని తెలుస్తోంది. ఇలాంటి వాళ్లకు టెప్లిజుమాబ్ మందు ఉపయోగకరంగా ఉంటుంది.
టెప్లిజుమాబ్ వాడటం వల్ల జబ్బు బయటపడటం పది సంవత్సరాలు ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ మందు వాడటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఒక కోర్సు మందు వాడటం వల్ల దీర్ఘకాలం ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మందు వాడకానికి అనుమతులు రావాల్సి ఉంది. ఈ మందు అందుబాటులోకి వస్తే మధుమేహ ముప్పు పొంచి ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది.
అయితే ఈ మందుకు ఎప్పటినుంచి అనుమతులు లభిస్తాయో చూడాల్సి ఉంది. మధుమేహానికి చెక్ పెట్టే దిశగా వచ్చే తొలి మందు ఇదే అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.