మారుతున్న మనుషుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మనుషులు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ సక్రమంగా అందితే మాత్రమే మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని నిత్యం వేధిస్తూ ఉంటాయి. విటమిన్లు, పోషకాలు అందితే వైరస్ లు, బ్యాక్టీరియాలు దాడి చేసినా ఇమ్యూనిటీ వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలం.
మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో అయోడిన్ కూడా ఒకటి. దేశంలో చాలామంది అయోడిన్ లోపం వల్ల బాధ పడుతున్నారు. నిత్యం వినియోగించే ఉప్పులో ఖచ్చితంగా అయోడిన్ ఉండేలా మనం జాగ్రత్త వహించాలి. తల్లికి అయోడిన్ లోపం ఉంటే పిల్లల్లో శారీరక ఎదుగుదల లేకపోవడం, జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక సమస్యలు, తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టే అవకాశం, మృతశిశువు జననం, గర్భస్రావం జరుగుతాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఇప్పటికే ఉప్పును తయారు చేసే కంపెనీలకు యూనివర్శల్ సాల్ట్ అయోడిసేషన్ ప్రమాణాలను పాటించాలని.. 20 కిలోల కంటే తక్కువ బరువు ఉండే ఉప్పులో అయోడిన్ మినరల్ ఉండాలని సూచించింది. మన శరీరంలో హర్మోన్లు, థైరాక్సిన్ ఉత్పత్తి కోసం అయోడిన్ అవసరం. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి హార్మోన్లు ఉపయోగపడతాయి.
మెదడు పెరుగుదలకు అయోడిన్ ఎంతో అవసరం. ఒక వ్యక్తికి రోజుకు 100 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది. అయోడిన్ లోపంతో బాధ పడే వారిని అసహనం, బరువు పెరగడం, బలహీనత, అలసట లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పసిపిల్లలు, గర్భవతులకు అయోడిన్ ఎక్కువగా అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు అయోడిన్ లోపంతో ఎక్కువగా బాధ పడుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది.