ఈ మధ్య కాలంలో యువతను ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. కొందరికి తమ అలవాట్ల వల్ల రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టకపోతే మరి కొందరికి ఆరోగ్య సమస్యలు నిద్ర పట్టకపోవడానికి కారణమవుతూ ఉంటాయి. అయితే వైద్యులు మాత్రం నిద్ర పట్టకపోవడం అనే సమస్యను తేలికగా తీసుకోవద్దని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఎవరైతే హాయిగా నిద్ర పోగలుగుతారో వాళ్లు మాత్రమే మిగిలిన సమయంలో ఎనర్జీతో పనులు చేయగలుగుతారు. ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధ పడుతుంటే వాళ్లు ఆ సమస్య నుంచి కోలుకోవడానికి నిద్ర చాలా అవసరం. సరిగ్గా నిద్రపోని వాళ్లు మధుమేహం, బీపీ, గుండెజబ్బులు, ఇతర మానసిక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక నిపుణులు స్లీపింగ్ డిజార్డర్స్ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు.
స్లీప్ యాప్నీయా అనే వ్యాధి కూడా కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక రకమైన శ్వాస సంబంధిత వ్యాధిని స్లీప్ యాప్నియా అని అంటారు. వీళ్లలో కొన్ని సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. ఫలితంగా శరీరానికి తగిన మోతాదులో ఆక్సిజన్ లభించక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. డిప్రెషన్ తో బాధ పడుతున్న వారిని ఎక్కువగా ఈ సమస్య వేధిస్తోంది.
కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధ పడే వారికి పని చేసే సామర్థ్యం అంతకంతకూ తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సరైన సమయంలో వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సులువుగా ఈ సమస్య నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. వైద్యులు కొన్ని పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించి చికిత్సను అందిస్తారు.