Street Food: హైదరాబాద్ లో ఒకప్పుడు బిర్యాని అత్యంత ఫేమస్ వంటకం గా ఉండేది. అప్పట్లో ఈ స్థాయిలో హోటల్స్ లేవు కాబట్టి అయితే పారడైజ్ లేకుంటే బావర్చి అనే తీరుగా ఉండేది. కాలం మారింది. తినే తిండి మారింది. ఫలితంగా లేనిపోని అలవాట్లు, కొత్త కొత్త ఆహారపు సంస్కృతులు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తడం మొదలుపెట్టాయి. దీనికి తోడు సోషల్ మీడియా వినియోగం పెరగడం.. యూట్యూబర్లు ఫుడ్ వ్లాగ్స్ చేయడం.. వంటివి ఇటీవల పెరిగిపోయాయి. దీంతో జనాలు స్ట్రీట్ ఫుడ్ తినడం అనేది పెరిగిపోయింది. సోషల్ మీడియా స్ట్రీట్ ఫుడ్ గురించి ఆహో ఓహో అని రాయడం కొంతకాలంగా విజయవంతంగా సాగిపోతోంది. యూట్యూబర్లు చెప్పడం.. ఆ హోటల్స్ వద్దకు ప్రజలు వెళ్లడం.. అడ్డమైన తిండి తినడం పరిపాటిగా మారింది. అక్కడ తయారయ్యే వంటకాలు నాణ్యంగా లేకపోవడం, రుచి, శుచి లేకపోవడం వల్ల వాటిని తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొందరు ఆరోగ్య విషమించి కన్నుమూస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు కుమారి ఆంటీ ఫుడ్ కూడా అంత నాణ్యం కాదు. భిన్నమూ కాదు. ఏదో సోషల్ మీడియా హైప్ వల్ల ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వాస్తవానికి యూట్యూబర్లలో ఫుడ్ వ్లాగ్స్ చేయడం వెనుక ఆర్థిక అంశాలే ఉంటాయి. రాయడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ మెజారిటీ ఫుడ్ వ్లాగర్స్ కమర్షియల్ ఎలిమెంట్ లోనే హోటల్స్ ను ప్రమోట్ చేస్తుంటారు. రకరకాల వెరైటీలు గురించి చెబుతుంటారు గాని.. అందులో ఎలాంటి పదార్థాలు వాడారు? వాటిలో ఉన్న పోషకాలు ఏంటి? వాటి తయారీలో శుభ్రత పాటించారా? ఏ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. చెప్పలేరు. అందువల్లే సోషల్ మీడియా రీల్స్ నమ్మి.. దిక్కుమాలిన, బూజు పట్టి, రంగు పోసి, మాల్ మసాలాలు దట్టించిన స్ట్రీట్ ఫుడ్ తింటే జరిగేది విషాదాలే.
స్ట్రీట్ ఫుడ్ చాలా డేంజర్
ఇలాంటి విషాదాలు ఎప్పుడూ జరగవు కదా.. ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి కదా.. అనే వాదించేవాళ్లు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మోమోస్ తిని ఒక మహిళ చనిపోయింది అంటే.. స్ట్రీట్ ఫుడ్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. గ్యాస్ సమస్యలు, కడుపునొప్పి, ఉదరంలో ఇబ్బందులు, వాంతులు, విరోచనాలు.. ఇలాంటివి వెలుగులోకి రావు. అసలు ఈ మోమోస్ అనేది మన వంటకం కాదు. నేపాల్, టిబెట్ లో బ్రేక్ ఫాస్ట్ గా తింటారు. మైదా పిండితో తయారుచేస్తారు. ఇందులో కూరగాయలు వాడుతుంటారు. ఆవిరి మీద ఉడికిస్తుంటారు. అయితే హైదరాబాదులో కేవలం మోమోస్ తయారీ కేంద్రాలు వెలిశాయి. ఇందులో నాన్ వెజ్ మోమోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని నూనెలో వేయించి తయారు చేస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసంతో మోమోలు తయారు చేయడం.. వాటిని తిన్నవారికి రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక మహిళ చనిపోవడం, 60 మంది అస్వస్థతకు గురి కావడం అంటే మామూలు విషయం కాదు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఆహార తనిఖీ అధికారులు సోదాలు చేస్తుంటే భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బూజు పట్టిన చికెన్, కుళ్ళిపోయిన మటన్, వాసన వస్తున్న చేపలు, పురుగులు పట్టిన రొయ్యలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవడో యూట్యూబర్ చెప్పాడని, ఫలానా హోటల్ గొప్పదని అక్కడికి వెళ్లి తింటే.. ఇదిగో ఇలాంటి సమస్యలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే బయట తిండి వద్దు. అస్సలు వద్దు.