
మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించడం కోసం కొంతమంది నిద్రమాత్రలు వాడుతుంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం నిద్రమాత్రలు ఎక్కువగా వాడినా ప్రమాదమేనని చెబుతున్నారు. నిద్రలేమితో బాధ పడేవాళ్లు పరిమిత కాలం మాత్రమే నిద్రలేమి మందులను వాడాలని ఆ మందులను ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులను తప్పవని వైద్యులు వెల్లడిస్తున్నారు.
నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడంలో నిద్రమాత్రలు తోడ్పడతాయని చాలామంది భావిస్తారని గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే నిద్రమాత్రలు నిద్రలేమిపై ప్రభావం చూపగలవని అమెరికన్ శాస్త్రవేత్తలు చేసిన క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. వైద్యులు రోగులకు ఎక్కువ కాలం నిద్రలేమి మందులను సూచించడం మంచిది కాదని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న 685 మంది మహిళలపై పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనకు తీసుకున్న సగటు వయస్సు 50 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈ మహిళలలో కొంతమందికి నిద్రమందులు ఇచ్చిన శాస్త్రవేత్తలు మరి కొంతమందికి మందులు ఇవ్వలేదు. శాస్త్రవేత్తల పరిశోధనలో మందులు మహిళలపై పెద్దగా ప్రభావం చూపలేదని వెల్లడైంది.
నిద్రలేమితో బాధ పడేవాళ్లు నిద్రపోకపోవడానికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు, నొప్పి, నిరాశ వల్ల కొంతమంది నిద్రలేమితో బాధ పడుతుంటారు. సరైన సమస్యను తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడం ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.