Processed Foods: మనలో చాలా మంది ప్రాసెస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. స్నాక్స్, చిప్స్, మ్యాగీ వంటి పదార్థాలు ఇష్టంగా లాగించేస్తుంటారు. అంతేకాదు చల్లగా ఉన్నాయంటూ కూల్ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే ఈ విధంగా తినడం, తాగడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే.. అదేంటి? అనుకుంటున్నారా? నిజమేనండి. ప్రాసెస్డ్ ఫుడ్ తినేవారి జీవిత కాలం తగ్గుతుందంట.
ప్రస్తుత బిజీ కాలంలో ఏది అందుబాటులో ఉంటే దాన్నే తినేస్తున్నారు. టైం సరిగా లేకపోవడంతో టిఫిన్ మొదలుకుని భోజం వరకు చాలా వరకు ప్రాసెస్డ్ ఆహారం మీదే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, వివిధ రకాల స్నాక్స్ ఇలా అందుబాటులో ఉన్న వాటితో సరిపెట్టుకుంటున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.
ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకోవడం వలన జీవిత కాలం తగ్గడంతో పాటు అకాల మరణం కూడా సంభవించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు, చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉండే ఈ ఫుడ్ ను తరచూ తినడం వలన శరీరానికి తగిన పోషకాలు అందవని తాజా అధ్యయనాలలో వెల్లడైందని తెలియజేస్తున్నారు. ఈ కారణంగానే బీపీ, మధుమేహంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
అంతేకాదు చిప్స్, బిస్కెట్ల వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వలన శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని.. ఇది చివరికి ప్రాణాపాయానికి దారి తీస్తుందని నిపుణులు తెలిపారు. దాంతోపాటుగా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధి వంటి పలు సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మెటబాలిక్ సిండ్రోమ్, స్థూలకాయం, ముసలితనం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే రోజువారీ ఆహారంలో పది శాతం కన్నా ఎక్కువగా ఇటువంటి ఫుడ్ ను తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు.