Sleeping : బిజీ లైఫ్, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి కామన్ గా మారింది. దీంతో ఆందోళన ఎక్కువే. ఈ సమస్యతో బాధపడుతుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలసట, ఏకాగ్రత లోపించడం, కండరాల సంకోచం వంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట సరిగా అసలు నిద్ర కూడా పట్టదు. ఆత్రుతతో కూడిన ఆలోచనలు మనసును గందరగోళానికి గురి చేస్తుంటాయి. మరి ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పరధ్యానం: సాధారణంగా రాత్రి సమయాల్లో యాక్టివిటీస్ ఎక్కువ ఉండవు. ఎటువంటి పనులు చేయకపోవడం వల్ల మనసు ఎక్కువగా పరధ్యానంగా ఉంటుంది. వివిధ రకాల ఆలోచనలు మెదడును డిస్ట్రబ్ చేస్తుంటాయి. చివరకు ఒత్తిడి, ఆందోళన వస్తుంది. ఇక నిద్ర కోసం ఎంత ప్రయత్నించినా రాదు.
కార్టిసాల్ లెవల్స్: కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోనట. ఇది శరీర సిర్కాడియన్ రిథమ్ వల్ల పని చేస్తుంది. సాధారణంగా అందరూ ఉదయం తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. అందుకే ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ పగటిపూట పెరుగడం స్ట్రాట్ అవుతుంది. ఆ తర్వాత అంటే రాత్రికి కాస్త తగ్గుతుంది. ఇలా రోజంతా ఒత్తిడికి గురైతే, రాత్రి శరీరంలో కార్టిసాల్ లెవల్ పెరుగుతుంది. ఫలితంగా ఆందోళన పెరిగి నిద్ర మీ దరిదాపుల్లో కూడా ఉండదు.
అతి ఆలోచనలు: రాత్రి సమయాల్లో మనసు టికెట్ లేకుండా ప్రపంచాన్ని చుట్టేస్తుంటుంది. బుర్ర హీటెక్కెలా అనవసర విషయాలు గుర్తు వస్తుంటాయి. ఆవేదన, మదన పడటం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హాయి తక్కువ. ఇబ్బంది ఎక్కువ.ఈ ఆలోచనలనే రేసింగ్ థాట్స్ అంటారు. ఈ ఆలోచనల్లో ఏదైనా చెడుగా అనిపిస్తే చాలు ఆందోళన అమాంతం పెరిగిపోతుంది. ఆలోచనలకు అడ్డు అదుపు ఉండకుండా నిద్రను దూరం చేస్తాయి.
శారీరక అసౌకర్యం: శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, గుండె దడ, కండరాల ఒత్తిడి వంటి వాటితో శరీరం అసౌకర్యంగా అనిపిస్తే మాత్రం మీకు కచ్చితంగా ఆందోళన ఎక్కువ అవుతుంది. శరీరం అసౌకర్యంగా ఉంటే నిద్ర అసలు రాదు.
జీవిత సంఘటనలు: కొన్ని విషాదాలు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు. మనసును మెలిపెట్టేస్తాయి. ఈ ఘటనల చుట్టే ఆలోచనలే తిరుగుతాయి. రాత్రిపూట కూడా ఈ ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. నిద్ర రాదు. సరే ఇవన్నీ ఒకే మరి. వీటికి పరిష్కార మార్గం లేదా అనుకుంటున్నారా? ఉంది. సమస్యకు కచ్చితంగా విరుగుడు ఉంటుంది. మరి అదేంటో కూడా చూసేద్దాం.
నివారణ మార్గాలు: రాత్రి పూట ఆందోళన చెందడం, దాని ఫలితంగా నిద్ర నాణ్యత లోపించడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే నిద్ర సమస్యకు త్వరగా చెక్ పెట్టాలి. మరి వీటికి చెక్ పెట్టడానికి ఉన్న మార్గాలు కూడా చూసేద్దామా..
ప్రశాంతంగా పడక గది: రాత్రిపూట ఆందోళన తగ్గడానికి, పడుకున్న వెంటనే నిద్ర పట్టడానికి మీ బెడ్ రూమ్ ను ప్రశాంతంగా ఉంచుకోవాలి. గాలి బాగా వచ్చేట్లు ఉంటే మరీ మంచిది. పడకగదిలో గందరగోళ వాతావరణం అసలు ఉండకూడదు. వస్తువులు చిందరవందరగా అసలు ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే బెడ్ రూమ్ నీట్ గా ఉంటే నిద్ర బెటర్ గా వస్తుంది.
నోట్ చేయడం: సాధారణంగా ఏదైనా సమస్య ఉంటే ఆలోచనలు దాని చుట్టు తిరుగుతుంటాయి. అసలు సమస్య ఏంటి? దాన్ని పరిష్కరించడానికి ఉన్న మార్గాలేంటి? తదితర అంశాలను నోట్ చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు ఆందోళన తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల అవసరంగా ఒత్తిడి రాదు. సమస్యకు సరైన పరిష్కారం కూడా లభిస్తుంది.
రిలాక్స్ టెక్నిక్స్: రాత్రి సమయాల్లో శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుకోవాలి. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవడం మరింత మంచిది. అందులో ముఖ్యంగా బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం, ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా ఆందోళన తగ్గి, రాత్రి హాయిగా నిద్ర వస్తుంది.