Hair Health Tips: చల్లదనం, వేడి ఇవి తట్టుకోవడం మాత్రమే కాదు వర్షాకాలం కూడా జుట్టుకు కష్టమే. తలమీద వర్షం నీరు పడితే చాలు జుట్టుకు ఎక్కడ లేని సమస్యలు వచ్చి పడుతుంటాయి. వర్షాకాలంలో గాలిలో చాలా వరకు తేమ పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య పెరుగుతుందట. అందుకే వర్షాకాలం శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. మరి ఈ సమస్యలకు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా ఓ సారి తెలుసుకుందామా?
వర్షాకాలంలో జుట్టు చిట్లడం, జుట్టు రాలడం వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి కనీసం 3 రోజులు అయినా కచ్చితంగా యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇది మాత్రమే కాదు కాస్త తేలిక పాటి షాంపూతో తలస్నానం చేసిన సరిపోతుంది. కానీ శుభ్రంగా ఉంచుకోవడం మాత్రం ముఖ్యం.
షాంపూ చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. డీప్ కండీషనర్ వాడటం మరీ మంచిది. ఇక జుట్టులో తేమ ఉండటానికి కొబ్బరి నూనె చాలా మంచిది. తలస్నానం చేసిన తర్వాత జుట్టును బాగా ఆరబెట్టండి. హెయిర్ డ్రయర్లకు బదులు ఫ్యాన్ తో జుట్టు ఆరబెట్టుకోవడం మంచిది. తడి జుట్టు ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది.
శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే జుట్టును బాగా దువ్వుకోవాల్సిందే. దీని వల్ల స్కాల్ప్ లో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. దీంతో సమస్యలు కూడా తగ్గుతాయి. ఇవే కాదు రోజు తినే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. నీరు, కూరగాయలు, గింజలు, పండ్లు ఎక్కువగా తినాలి. శరీరంలో పోషకాలు లేకున్నా కూడా జుట్టు సమస్యలు వస్తుంటాయి.