Heart Health: అతి సర్వత్రా వర్జయేత్… అంటే ఏదైనా మోతాదుకు మించితే కష్టం, నష్టం అని అర్థం.. అందుకే ఏది కూడా పరిమితిని దాటకూడదు. ఇష్టం వచ్చింది తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. ఆ కొలెస్ట్రాల్ అధిక బరువుకు దారితీస్తుంది.. అంతేకాదు రక్తపోటు, మధుమేహం కూడా పలకరించే ప్రమాదం ఉంటుంది.. అందుకే దేనికీ అతి పనికిరాదనే సూత్రాన్ని గుర్తు పెట్టుకోవాలి.. ముఖ్యంగా మితాహారం ఆరోగ్యానికి మంచిది అనే సూత్రాన్ని పాటించాలి.. మద్యం తాగడం, ఫ్యాటీ, కార్బోహైడ్రేట్స్ పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టు వంటి ప్రమాదాలు ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియో మయోపతికి అధిక ఆల్కహాల్ తీసుకోవడం, తీసుకునే ప్రధాన ఆహారాన్ని కారణాలుగా వైద్యులు గుర్తించారు.. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం.. కనుక మంచి చేసే ఆహారాన్ని మితంగా తీసుకోవడానికి పరిమితం కావాలి.

ఈ పదార్థాలు వద్దే వద్దు
బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులు, మాంసాహారానికి బదులు సాంప్రదాయ భారతీయ ఆహారానికి పరిమితం కావాలి.. తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది.. అంటే గతి తప్పుతుంది.. ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ( గుండె అతివేగంగా కొట్టుకోవడం) రిస్కు ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత మొప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతివేగంగా కొట్టుకుంటే అది హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారి తీయవచ్చు. మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది.. అలాగే గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది.

ఇక రోజువారి వ్యాయామం 30 నుంచి 40 నిమిషాల పాటు చేయాలి.. వేగవంతమైన నడక లేదంటే ఒక మోస్తరు పరుగు, ఏరోబిక్ వ్యాయామాలు, స్విమ్మింగ్ చేయవచ్చు.. డాన్స్ కూడా వ్యాయామం కిందకు వస్తుంది.. భోజనానికి భోజనానికి మధ్యలో పండ్లు, నట్స్ మినహా మరే ఇతర చెత్తను తీసుకోకుండా ఉంటే మంచిది. భోజనంలో భాగంగా అధికంగా ప్రాసెస్ చేసినవి, వేయించినవి తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన వాటికి చోటు ఇవ్వాలి. అంతేకాకుండా రోజువారీగా తీసుకోవలసిన ఔషధాలకు బ్రేక్ ఇవ్వకూడదు.. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో మాత్రలు వేసుకోకూడదు . వ్యాయామాల వల్ల రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది.. అందుకే వ్యాయామాలు తప్పనిసరి.. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గర దారి అవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏటా గుండె సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి.. దీనిపై ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిందే.. ప్రాణాలు తీస్తున్న గుండె వ్యాధుల గురించి ముందు నుంచే జాగ్రత్త పడటం చాలా మంచిది.