Afternoon Sleeping : ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అనేది తప్పనిసరి. కొంతమంది అయితే తీరిక సమయం దొరకడమే లేటు.. ఇక నిద్రపోవడమే పనిగా పెట్టుకుంటారు. అయితే రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి అవసరమే. అయితే కొందరు పగలు కూడా అప్పుడప్పుడు నిద్రపోతుంటారు. కొంతమంది ఏదో రిలాక్స్ కోసం ఓ అరగంట అలా నిద్రపోతే మరికొందరు గంటల తరబడి నిద్రపోతుంటారు. పగలు పడుకోవడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని చాలామంది అంటుంటారు. కానీ కొంతమంది పగటి పూట కొంత సేపు నిద్ర ఆరోగ్యానికి మంచిదే అని భావిస్తారు. అయితే పగలు నిద్రపోవడం కరెక్టేనా? కాదా? ఒకవేళ పగలు నిద్రపోతే ఎంతసేపు నిద్రపోవాలి? దీనివల్ల కలిగే ఫలితాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
పగటి పూట నిద్రపోతే బద్దకం కోసమే నిద్రపోతున్నారని చాలామంది అంటుంటారు. కానీ పగటి పూట కాస్త సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే రోజంతా కష్టపడి ఏదో ఒక పనిచేయడం లేదా రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం వల్ల రోజు మొత్తం చాలా నీరసంగా ఉంటారు. అదే పగటి పూట గంట పడుకుంటే చాలు. యాక్టివ్‌గా ఉండటంతో పాటు రోజంతా మీకు ఒక రిఫ్రెష్‌లా ఉంటుంది. అలాగే పగటి పూట నిద్ర మీకు జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు చిరాకు, కోపం కూడా తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మన మెదడు రసాయన సంకేతాలతో పనిచేస్తుంది. రోజులు, వయస్సు పెరిగేకొద్దీ నిద్రకు కొంత సమయం కేటాయించడం వల్ల మతిమరుపు పోతుంది. కొంతమంది శ్రమతో కూడిన పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లతో పాటు ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లు పగటి పూట కాస్త పడుకుంటే ఎంతో నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.
పదినిమిషాలైన పగటి పూట నిద్రపోతే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే ఎన్నో రకాల జబ్బుల బారి నుంచి బయటపడవచ్చు. ఇన్ఫెక్షన్, వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండె సమస్యలు తగ్గి.. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. నిద్రలేచిన వెంటనే కాకుండా.. 6 నుంచి 8 గంటల తర్వాత మళ్లీ పడుకోవడం మంచిది. ఇలా నిద్రపోవడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే ఎలాంటి సమస్య వచ్చిన పరిష్కరించుకోగల శక్తి, సామర్థ్యాలు వస్తాయి. నిద్రపోవడం వల్ల మంచిదని ఎక్కువసేపు పడుకోకూడదు. పగటిపూట కేవలం అరగంట నిద్రపోతే చాలు. ఈ నిద్రే ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల పక్షవాతం, బద్దకంగా ఉండటం, చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత పడుకోకపోవడమే మంచిది. ఆ తర్వాత పడుకుంటే రాత్రికి నిద్రపట్టదు. కాబట్టి కేవలం అరగంట లేదా గంటసేపు నిద్రపోవడం మంచిది.