Health Tips: సాధారణంగా ఐస్ క్రీమ్ లను వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వద్దని చెప్పినా వినకుండా మారం చేసి మరీ ఐస్ క్రీమ్ లను తింటుంటారు. ఇక సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తింటారు. అయితే వేసవిలో ఐస్ క్రీమ్ తినడం మంచిదేనా? కాదా? నిజంగా ఎండ వేడిని ఐస్ క్రీమ్ తగ్గిస్తుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా చల్లని పానీయాలతో పాటు ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తింటారు. శరీరాన్ని చల్లబరుస్తుందని ఐస్ క్రీమ్ ల వైపు ఆకర్షితులు అవుతుంటారు. అద్భుతమైన రుచితో పాటు చల్లగా ఉండే ఐస్ క్రీమ్ ప్రస్తుతం రకరకాల ప్లేవర్లలో దొరుకుతుంది.
అయితే అందరూ భావించినట్లు ఐస్ క్రీమ్ తినడం వలన మన శరీరం చల్లబడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐస్ క్రీమ్ కు, శరీర టెంపరేచర్ కు ఎలాంటి సంబంధం ఉండదట. ఐస్ క్రీమ్ చల్లగా ఉండటం వలన మనకు ఆ ఫీలింగ్ కలుగుతుందని తెలియజేస్తున్నారు. నిజానికి బాడీ టెంపరేచర్ ను ఏ మాత్రం తగ్గించదని నిపుణులు చెబుతున్నారు.
ఐస్ క్రీమ్ లలో కొవ్వు పదార్థాలు, చక్కెర, కెలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వీటిని ఎక్కువగా తినడం వలన ఊబకాయం, మధుమేహం పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు.
ఎండ వేడిని తగ్గించుకోవడానికి కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.