
కరోనా సోకిన వారిలో దగ్గు, జలుబు, తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో పాటు వాసన, రుచి కోల్పోవడం కూడా లక్షణాలుగా గుర్తించారు. కేవలం రుచి, వాసన కోల్పోయే లక్షణాలు ఉన్నా కరోనా సోకినట్లేనని నిపుణులు తేల్చారు. ఇలాంటి లక్షణాలతో కొందరు పరీక్షలు చేయించుకోగా వ్యాధి నిర్దారణ అయిన కేసులు చాలా ఉన్నాయి. సాధారణంగా జలుబు చేస్తే రుచి కోల్పోతారు. కానీ ఎలాంటి జలుబు లేకుండా వాసన కోల్పోతే మాత్రం అది కచ్చితంగా కరోనా ప్రభావమేనని నిర్దారిస్తున్నారు.
కరోనా వైరస్ నిర్దారణ అయిన కొన్ని రోజుల తరువాత రుచి, వాసన కోల్పోతారు. ఈ పరిస్థితి రాగానే అనేక మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇరాన్‌లోని ఓ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం రుచి, వాసన కోల్పోతే మంచిదేనంటున్నారు. వైరస్ బారిన పడి ఐదోరోజు ఘ్రాణ శక్తి కోల్పోయిన వారు త్వరగా కోలుకుంటారట. అంతేకాదు ఈ లక్షణాలు వచ్చిన వారి ఆరోగ్యం విషమించడం లేదట.
ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆప్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం ‘కరోనాబారిన పడిన వారంతా వాసన కోల్పోవడం లేదు. ఎవరైతే వాసన కోల్పోతున్నారో వారు త్వరగా కోలుకుంటున్నారు’.. ఇదే రకమైన విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన మ్రుఖ సంస్థలు చేసిన అధ్యయనాల్లో వెల్లడించాయి.
ఇరాన్‌లో కరోనా సోకిన 207 మంది రోగులపై పరిశోధన చేశారు. వారిలో 179 మంది ఒక నెలలోనే పూర్తిగా కోలుకున్నారు. అధ్యయనానిక పరిశోధకులు ఎంచుకున్న సగటు వయసు 41. కరోనాతో వాసన కోల్పోయిన వారిలో తొలుత తలనొప్పి, జలుబు తగ్గడాన్ని గుర్తించారు. 58 శాతం మందిలో ఇవే ప్రథమ లక్షణాలుగా గుర్తించారు. 42 శాతం మందిలో వేరే లక్షణాలు వచ్చాయి. ఇక వాసన కోల్పోవడం కూడా హఠాత్తుగా జరుగుతున్నట్లు గుర్తించారు.
కరోనా సోకిన వ్యక్తికి ఐదు రోజుల్లో వాసన కోల్పోయే అవకాశముందన్నారు. రుచి కూడా అంతే స్పీడ్‌లో కోల్పోతారన్నారు. అయితే తలనొప్పి, జలుబు, ప్లేట్‌లెట్స్ తగ్గడం కాకుండా వేరే లక్షణాలుంటే మాత్రం రుచి, వాసన రావడం కొంత ఆలస్యమవుతుందన్నారు. గొంతులో గరగర ఉన్న వారిలో వాసన కోల్పోవడం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా వాసన కోల్పోయినవారు త్వరగా కోలుకుంటారని గుర్తించారు.