Over Eating: తిండి కలవాడే కండ కలవాడు… కండ కలవాడే సరైన సమర్థుడు.. అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే సరైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని.. అప్పుడు ఏ పని అయినా చేయడానికి శక్తి ఉంటుందని దీని అర్థం. అయితే ఒకప్పుడు పెద్దలకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో కావాల్సిన తిండి దొరకలేదు. అయినా కూడా వారు దొరికిన దాంట్లో సర్దుకొని తక్కువ ఆహారాన్ని తిని ఆరోగ్యంగా ఉండగలిగారు. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని చూస్తే నోరు ఊరుతుంది. కానీ అలా నోరు ఊరుతుందని ఇష్టం వచ్చినట్టు తింటే చిన్న వయసులోనే పెద్ద రోగాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఆహారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ కళ్ళ ముందు కనిపించే ఆహారాన్ని తినకుండా ఉండడం ఎలా? వాటిని నియంత్రించడానికి ఏం చేయాలి?
ఒక్కోసారి మన కళ్ళ ముందు రుచికరమైన పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని క్రమ పద్ధతిలో తీసుకుంటే పర్వాలేదు. కానీ మోతాదుకు మించి తినడం వల్ల శరీరంలో అనవసరపు కొవ్వు పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని మలినాల వల్ల శరీరంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కళ్ళ ముందు ఎలాంటి ఆహారం కనిపించినా.. తినకూడదు అని గట్టి నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాస్త సులువుగా ఉంటే… ఆ తర్వాత ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అందువల్ల ఏదైనా ఇబ్బందికర ఆహారం కనిపిస్తే మనసులో గట్టి నిర్ణయం తీసుకొని నో చెప్పడమే సమంజసం.
చాలామంది ఉదయం లేవగానే ఈరోజు ఎలాంటి ఆహారం తినాలి? అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తంలో ఆహారం తినాలి అని ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పటికే ఎన్నో రకాల రుచులు చూసినవారు.. ఇకనుంచి అయినా వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలని అనుకుంటే.. అందులో సగం వరకు తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ సగం ప్రోటీన్లు కలిగినది ఉండాలి. ఆయిల్ వస్తువులు, అల్సర్ కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అప్పుడే మితమైన ఆహారం శరీరంలోకి వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
కొన్ని ప్రదేశాల్లో విపరీతమైన ఆకలి వేస్తుంది. కానీ అక్కడ ఎలాంటి ఆహార పదార్థాలు దొరకలేని సమయంలో ఏదో ఒకటి తిని ఊరుకుంటాం. అంటే అందుబాటులో లేకపోతే సర్దుకునే ప్రయత్నం చేస్తాం. అదే అందుబాటులో ఉంటే వాటిని ఎడాపెడా లాగించేస్తాం. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే అందుబాటులో ఎలాంటి ఆహార పదార్థాలు లేకపోతే మనం తినడానికి సాహసించం. అందువల్ల కొవ్వు కలిగించే లేదా స్థాయికి మించిన ఆహార పదార్థాలను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. అవసరం అయినవి మాత్రమే తీసుకోవాలి అనే ప్రణాళిక వేసుకోవాలి. దీంతో సగంలో సగం వరకు ఆహారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు.
ఒక్కోసారి ఏ పని లేనప్పుడు ఆహార పదార్థాలు తినాలని అనిపిస్తుంది. ఇలా చాలా సందర్భాల్లో జరిగితే శరీరంలోకి అదనంగా ఆహారం వెళ్లి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొవ్వు కలిగే ఆహార పదార్థాల కంటే ప్రోటీన్లు ఇచ్చే డ్రైఫ్రూట్స్ వంటివి అందుబాటులో ఉంచుకోవడం మంచిది.