Pimples: ఒక వ్యక్తిలో యవ్వనం రాగానే మొహంపై అనేక ఛాయలు కనిపిస్తాయి. వీటితో పాటు పింపుల్స్ వస్తుంటాయి. కొంత మంది వైద్యులు చెబుతున్న ప్రకారం.. చర్మంపై ధూళి లేదా ఆయిల్ ఎక్కువగా ఉండడం కారణంగా ఇవి వస్తుంటాయని అంటుంటారు. కానీ శరీరంలో ఇన్సులిన్ స్థాయులు పెరగడం కూడా మొటిమలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యంగా అధిక చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునే ఆహార అలవాట్లు హార్మోన్ సమతుల్యతను దెబ్బతీసి పింపుల్స్ సమస్యను పెంచుతాయని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఉండడానికి కారణమేంటి?
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లు కొత్తగా ఉంటున్నాయి. రోజూవారీ ఆహారంలో భాగంగా అదనంగా కూల్డ్రింక్స్, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, నూడిల్స్, కేకులు, స్వీట్లు వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. దీంతో శరీరంలో ఎక్కువ ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. ఇన్సూలిన్ అధికమైతే ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్లు చర్మంలోని ఆయిల్ గ్రంథులను ఎక్కువగా పనిచేయించేలా చేస్తాయి. దీంతో సెబమ్ (ఆయిల్) అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఆయిల్ చర్మరంధ్రాల్లో చేరి అవి మూసుకుపోతాయి. మూసుకుపోయిన రంధ్రాల్లో బ్యాక్టీరియా పెరిగి వాపు కలిగించి మొటిమలు ఏర్పడతాయి.
యువతలో, ముఖ్యంగా యుక్తవయస్సులో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ అమ్మాయిలలో నెలసరి ముందు లేదా సమయంలో, అబ్బాయిలలో టెస్టోస్టెరాన్ మార్పుల వల్ల మొటిమలు అధికమవుతాయి. అలాగే నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కూడా హార్మోన్లపై ప్రభావం చూపి చర్మ సమస్యలను పెంచుతాయి.
అయితే మొహం పై పింపుల్స్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది. వైద్యుల సూచన ప్రకారం.. ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్న ఆహారం చర్మానికి రక్షణ కల్పిస్తుంది. అలాగే వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు , చేపలు, పాలకూర , క్యారెట్ వంటివి తీసుకోవాలి. ఇవి తినడం వల్ల చర్మ వాపును తగ్గిస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. జింక్ సమృద్ధిగా ఉండి చర్మానికి మేలు చేస్తాయి. ఓమెగా-3 వల్ల చర్మ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది . విటమిన్ A, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. చర్మాన్ని రక్షించే బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.
మొటిమలు ఎక్కువగా రావడం, మచ్చలు పడటం, నొప్పి కలగడం, లేదా దీర్ఘకాలంగా తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఇది హార్మోన్ సమస్యలు, PCOS, లేదా ఇతర మెటబాలిక్ సమస్యలకు సంకేతం కావచ్చు. చిన్న చిన్న ఆహార మార్పులు, సరైన జీవనశైలి పాటిస్తే మొటిమల సమస్యను చాలావరకు నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు
