Life: ఎవరైనా చనిపోగానే మనం ఆయన ఆయుష్షు తీరింది.. ఆయనకు భూమిమీద నూకలు చెల్లాయ్ అని అంటుంటా. చిన్న వయసులో చనిపోతే దేవుడు చిన్న చూపు చూశాడు అని నిందిస్తాం. దేవుడే విధిరాత రాస్తాడు అనేది మన నమ్మకం. అయితే ఆ విధిరాత అందరికీ ఒకేలా ఉండదు. కానీ, ఆ ప్రాంత ప్రజల ఆయుప్రమాణాన్ని దేవుడు ఒకేలా పెట్టినట్టున్నాడు. అందుకే వాళ్లు నిండు నూరేళ్లు జీవిస్తున్నారు.
సగటు ఆయుర్ధాయం 73.4 ఏళ్లు..
ఫ్రాన్స్‌కు చెందిన క్రై స్తవ సన్యాసిని లుసిల్లే స్థానికంగా సిస్టర్ అండ్రేగా సుపరిచితం. తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారామె. లుసిల్లే రాండన్ జనవరిలో తుది శ్వాస విడిచారు. అప్పటికామె వయసు 118 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరుందామెకు. చంద్రుడిపై మనిషి కాలు మోపినప్పటి కాలాన్ని, ప్రస్తుత డిజిటల్ యుగాన్ని ఆమె కళ్లారా చూశారు.
మనిషి సగటు ఆయుర్ధాయం 73.4 సంవత్సరాలుగా ఉన్న ప్రాంతంలో లుసిల్లే నివసిస్తున్నారు. అందుకే ఆమె స్టోరీ కాస్త ప్రత్యేకం. ప్రజల జీవన కాలం పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఈ శతాబ్దం మధ్య కాలం నాటికి ప్రజల సగటు ఆయుర్ధాయం 77 ఏళ్లకి చేరనుంది. ప్రజల జీవన కాలం పెరుగుతుండగా.. పుట్టే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో, వృద్ధుల జనాభా పెరుగుతోంది. ప్రపంచంలో అయిదేళ్ల లోపున్న పిల్లల జనాభా కంటే 65 ఏళ్లు పైబడిన వారి జనాభా రెండింతలు ఉంది. అయితే, ప్రపంచంలో అన్ని దేశాల్లో పరిస్థితి ఇలా లేదు.
మోనాకోలో 87 ఏళ్ల ఆయుష్షు
మోనాకో దేశంలో ప్రజల సగటు ఆయుర్ధాయం 87 ఏళ్లు. ఆఫ్రికాలో అతి పేద దేశమైన రిపబ్లిక్ ఆఫ్ చాడ్ ప్రజల సగటు వయసు కేవలం 53 ఏళ్లే. మోనాకో తర్వాత ప్రజలు ఎక్కువ కాలం జీవించే దేశాల్లో చైనా పాలనలో ఉన్న హాంకాంగ్ రెండో స్థానంలో ఉంది. మకావు మూడు, జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో, జపాన్‌లోనే ప్రజల సగటు వయసు ఎక్కువగా ఉంది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టు ప్రకారం, సగటు ఆయుర్ధాయం అధికంగా ఉన్న మిగిలిన దేశాల జాబితాలో స్విట్జర్లాండ్, సింగపూర్, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్ దేశాలు లాంటి దేశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారిని, ప్రపంచ యుద్ధాలను పక్కన పెడితే, రెండు వందల ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్ధాయం పెరుగుతూ ఉంది. వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, మెరుగైన ఔషధాల అభివృద్ధితో పాటు.. ప్రజలకు సురక్షితమైన జీవన విధానాలను, సరిపడా ఆహారాన్ని అందిస్తుండటంతో ప్రజల సగటు జీవన కాలం పెరుగుతోంది. ప్రజల ఆయుర్ధాయం పెంచేందుకు జన్యుపరమైన అంశాలతోపాటు, ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చిన్న దేశాల్లో జీవితకాం ఎక్కువ..
జీవన ప్రమాణం ఎక్కువ ఉన్న దేశాల జాబితాలో మోనాకో, లిక్టెంస్టెయిన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇవి చాలా చిన్నవని ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాల విభాగపు హెడ్ పాట్రిక్ గెర్లాండ్ అన్నారు. ఇతర దేశాల్లో మాదిరి ఆ దేశ జనాభాల్లో ఎలాంటి వైవిధ్యం లేదన్నారు. ‘‘ఈ దేశాలు చూడటానికి చాలా ప్రత్యేకమైనవి. వాస్తవంగా ఈ దేశ జనాభా ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటోంది. ఇతర దేశాల్లో వివిధ రకాల జనాభాల కలయికను మనం చూడొచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు’’ అని ఆయన తెలిపారు. అత్యంత ఉన్నతమైన జీవన ప్రమాణాలు ఈ దేశాల్లో ఉంటాయన్నారు. వైద్య, విద్య సౌకర్యాలు చాలా బాగుంటాయని చెప్పారు.
వృద్ధాప్యం ఒక వ్యాధేనా..
ప్రపంచ జనాభాలో చాలా చిన్న భాగం ‘బ్లూ జోన్’. ఇతరులతో పోలిస్తే ఇక్కడి ప్రజలు చాలా ఎక్కువ కాలం నివసిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం, జనాభా గణాంకాల నిపుణులు మైఖెల్ పుల్లాన్, వృద్ధ వైద్య నిపుణులు జాని పీస్ ప్రపంచంలో అత్యంత వృద్ధులు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. వందేళ్ల వరకు జీవించిన వారు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో, నగరాల్లో నివసిస్తున్నారో గుర్తించారు. ఆ ప్రాంతాలను బ్లూ మార్కర్‌తో మ్యాప్‌లో సర్కిల్ చేశారు. మ్యాప్‌లో నీలం రంగులో మార్క్ చేసిన ప్రాంతాలను బార్బాజాగా వారు గుర్తించారు. ఇది ఇటలీ ఆధీనంలో ఉన్న సార్డినీయా దీవిలో ఉంది. దీన్ని ‘బ్లూ జోన్’గా వారు పేర్కొన్నారు. అప్పటి నుంచి, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో ప్రజలు ఎక్కడైతే ఎక్కువ కాలం జీవిస్తారో ఆ ప్రాంతాలను బ్లూ జోన్లుగా పిలుస్తున్నారు. ఈ అధ్యయనాన్ని ఆధారంగా చేసుకుని, జర్నలిస్ట్ డాన్ బ్యూట్నర్ కూడా ఒక నిపుణుల బృందంతో ఇలాంటి కమ్యూనిటీలు ఇంకెక్కడ ఉన్నాయో ఇన్వెస్టిగేట్ చేశారు.
మరో నాలుగు బ్లూ జోన్లు..
సార్డినీయా కాకుండా మరో నాలుగు బ్లూ జోన్లను వారు గుర్తించారు. ఇవి జపాన్‌లోని ఒకినావా, కోస్టా రికాలో నికోయా, గ్రీస్‌లోని ఐకారియా ద్వీపం, కాలిఫోర్నియాలోని లోమా లిండా అడ్వెంటిస్ట్ కమ్యూనిటీలు. ప్రజలు ఎక్కువ కాలం జీవించేందుకు జన్యుపరమైన కారణాలు కూడా కీలకంగా ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, బ్లూ జోన్లను ప్రభావితం చేస్తున్న ఇతర అంశాలేమిటన్నది అర్థం చేసుకునేందుకు వైద్యుల బృందం, ఇతర రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. కమ్యూనిటీలపై బ్యూట్నర్, ఆయన బృందం చేపట్టిన అధ్యయనంలో కొన్ని సారూప్యతలను గుర్తించారు. వీటి ఆధారంగా, ప్రపంచంలో ఇతర ప్రాంతాల ప్రజలతో పోలిస్తే ఈ కమ్యూనిటీల్లో ప్రజలు ఎక్కువ కాలం, మెరుగైన జీవితాన్ని ఎలా బతకగలుగుతున్నారని ఆయన వివరించారు.
కొన్ని సారూప్యతలు..
– వారి జీవితంలో ఒక లక్ష్యమనేది ఉంది. ఆ లక్ష్యం కోసమే వారు ప్రతి ఉదయం నిద్ర లేస్తున్నారు.
– కుటుంబ సంబంధాలను వారు బలంగా ఉంచుతున్నారు.
– నిత్యం చేసే పనుల నుంచి బ్రేక్ తీసుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు. సామాజిక అలవాట్లలో భాగంగా ఇతర కార్యకలాపాల్లో కూడా వారు పాలుపంచుకుంటున్నారు.
– కడుపు పూర్తిగా నిండే వరకు వారు తినరు. తమ పొట్ట 80 శాతం నిండే వరకు మాత్రమే వారు భుజిస్తారు.
– సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. వీటిల్లో కూరగాయలు, పండ్లు ఉంటాయి.
– ఆల్కాహాల్‌ని కూడా పరిమితంగా తీసుకుంటారు.
– ప్రతి రోజూ వాకింగ్ చేస్తూ శారీరక వ్యాయామాలను చేపడుతున్నారు.
– సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ, మంచి అలవాట్లను ప్రోత్సహిస్తున్నారు.
– ఆధ్యాత్మికాన్ని నమ్మే గ్రూప్‌ల్లో కూడా వారు పాల్గొంటూ, ప్రమోట్ చేస్తున్నారు.
– వీటితో పాటు, వారి జీవన విధానాల్లో భాగంగా పెద్ద పెద్ద పట్టణాలకు దూరంగా ఉంటూ, స్నేహపూర్వక వాతావరణాన్ని, సహజ గుణాన్ని కలిగి ఉండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు.
ఒంటరిగా ఉండట్లేదు
ఆర్థిక పరిస్థితులు, అక్కడి ప్రజల డీఎన్‌ఏలో ఉన్న నైపుణ్యాలు మాత్రమే కాక.. ఇప్పటి వరకు మనం తక్కువ శ్రద్ధ చూపిన ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు చెప్పారు. ఈ విషయాలు మనకు చాలా చిన్నవిగా అనిపించొచ్చు. కానీ, ఎక్కువ కాలం పాటు ఎవరైతే మెరుగైన జీవనాన్ని సాగించాలనుకుంటారో వారికి ఇవొక పెద్ద సవాలుగా ఉంటున్నాయని అన్నారు. ఒక వ్యక్తి ఎక్కువ కాలం బతికేందుకు వారి శరీరంలోని జన్యువులు 25 శాతం కారణం కాగా, మిగతా అంశాలే కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: How many years of life do you know which people live the longest in the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com