Karimnagar Collector Pamela: అంధులను, దివ్యాంగులను చూసి ఎవరైనా జాలి పడతారు.. అవసరమైతే వారికి తోచిన సహాయం చేస్తారు. కానీ వారిలో చైతన్య నింపే కార్యక్రమాలు చేయడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులోనూ ఒక జిల్లా కలెక్టర్ గా ఉన్న వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం అంటే అరుదైన విషయమే. అలాంటి అరుదైన పనిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేశారు. అంధులు, దివ్యాంగులను చూసి జాలి జాలి పడలేదు. వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా దివ్యాంగులలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఒక పాట పాడారు. ఈ పాట కూడా సింధు శ్రీ అనే దివ్యాంగు ర్యాలీతో పాడడం విశేషం.
డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరీంనగర్లో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవం ప్రత్యేకంగా నిలిచింది. కరీంనగర్లోని భవిత సెంటర్కు వెళ్లిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దివ్యాంగులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యం ఎంత’ అన్న పాట పాడారు. ఈ పాటను ప్రముఖ సినీ రచయిత చంద్ర బోస్ రాశారు. 2009లో రిలీజ్ అయిన ‘ నింగి నేల నాదే’ అనే సినిమాలోనిది ఈ పాట. అయితే ఈ పాటను కలెక్టర్ పమేలాసపతి సింధుశ్రీ తో కలిసి స్థానిక అందుల పాఠశాల ఉపాధ్యాయురాలు సరళ, మ్యూజిక్ డైరెక్టర్ కేబి శర్మ ఆధ్వర్యంలో పాడారు. పూర్తిగా రికార్డింగ్ చేసిన ఈ పాటను దివ్య దృష్టి అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. దివ్యాంగుల్లో ఎంతో స్ఫూర్తిని నింపే ఈ పాటతో కలెక్టర్ అందరిని ఆకట్టుకున్నారు.
ప్రజా కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండే కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలోనూ ఆడపిల్లల రక్షణ కోసం ‘ఓ చిన్ని పిచ్చుక’అనే సాంగ్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి పాట పాడి ప్రత్యేకంగా నిలిచారు. దివ్యాంగులు, అందులను చూసి జాలి పడడం కంటే వారిలో చైతన్యాన్ని నింపడమే అసలైన సాయం అని కొందరు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా అధికారిగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కలెక్టర్పై పలువురు ప్రశంసిస్తున్నారు.