HBD : ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషి గట్టిగా 50 లేదా 60 సంవత్సరాలు బతికేతే గొప్ప. పీల్చేగాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఆవాసం..ఇలా అన్నీ కలుషిత మయమే. ఎప్పుడు ఏ రోగం ముంచుకొస్తుందో తెలియదు. ఎలాంటి వ్యాధులు ఇబ్బంది పెడతాయో తెలియదు. ఇలాంటప్పుడు మనిషి జీవితం దిన దిన గండం.. అర్దాయుష్షు. ఇలాంటి కాలంలో కూడా ఓ మహిళ 104 సంవత్సరాల వయసుకు చేరుకుంది. ఈ వయసు లోనూ ఆమెకు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు లేవు. ఆమె పని ఆమె చేసుకుంటుంది. కంటి చూపు బాగానే కనిపిస్తుంది. వినికిడి బాగానే వినిపిస్తుంది. దంతాలు కూడా పెద్దగా ఊడలేదు. అలాగని ఆమె మాంసాహారం తినదు. శాకాహారం మాత్రమే తింటుంది. 104 సంవత్సరాల వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఇటీవల ఆమె 104వ జన్మదినాన్ని 90 సంవత్సరాల ఆమె కుమారుడు ఘనంగా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఆ వృద్ధురాలి పేరు మండాగున్న రాజమ్మ. 1920లో జన్మించింది. ఆమెకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. 14 సంవత్సరాల వయసులో ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు మూడు సంవత్సరాల వయసుకు వచ్చేసరికి రాజమ్మ తన భర్తను కోల్పోయింది. అప్పటినుంచి ఆమె తన కొడుకుతో తల్లిదండ్రుల వద్ద ఉన్నది. ఆమెను కూడా వారు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అప్పట్లో రాజమ్మ థర్డ్ ఫారం వరకు చదివింది. కుట్లు, అల్లికలతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కష్టపడి చదివించింది. అతడు కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
రాజమ్మ చిన్నప్పటి నుంచి శాఖాహారం మాత్రమే తీసుకునేది. ఆమెకు జలుబు, జ్వరం తప్ప మరెలాంటి దీర్ఘ కాలిక వ్యాధులు లేవు. బయటి ఆహారం అసలు తినదు. పరిమితికి మించి ఆహారం తీసుకోదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది. కేవలం ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తింటుంది. ఇంతటి వయసు లోనూ ఆమె ఖాళీగా ఉండదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. 104 సంవత్సరాల వయసులోనూ అటూ ఇటూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికి కూడా ఆమెకు ఎటువంటి మోకాళ్ల నొప్పులు లేవు.. మాటలు కూడా చక్కగా మాట్లాడుతుంది. చర్మం కూడా ముడతలు పడలేదు. సాత్విక ఆహారమే తన తల్లి ఆరోగ్య రహస్యమని ఆమె కొడుకు చెబుతున్నాడు.
ఇటీవల ఆమె జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తే.. అందులో నుంచి ఒక చిన్న ముక్క మాత్రమే తిన్నదని.. మా అమ్మకు ఆరోగ్య స్పృహ ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ చిన్న ఉదాహరణ చాలని ఆమె కొడుకు వివరించాడు. ప్రస్తుత తరంలో చాలామంది బయట తినడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంట్లో వండటాన్ని పూర్తిగా తగ్గించేశారు. జొమాటో లేదా స్విగ్గి నుంచి ఆర్డర్ తెప్పించుకొని తింటున్నారు. తినే తిండిలో మాంసాహారమే ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు.. శారీరక శ్రమ అసలు కోరుకోవడం లేదు.. చేసే ఉద్యోగంలో కూడా చెమట చిందడం లేదు. దీంతో చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. హృద్రోగం వంటి సమస్యలతో అకాల మరణం చెందుతున్నారు. అలాంటి వారు రాజమ్మ జీవనశైలిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.