Physically Fit
Physically Fit: భారత దేశంలో దాదాసు సంగం మంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. 50 శాతం మందికి శారీరక శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదట. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 2022లో భారత దేశంలో దాదాపు 50 శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.
డబ్ల్యూహెచ్‌వో సూచన ఇలా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. 18 ఏళ్లు నిండిన వారు వారానికి కనీసం 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. దీని ఆధారంగానే 2000–2022 మధ్య కాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేస్తోంది. దక్షిణాషియాలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం, పురుషులకన్నా 14 శాతం ఎక్కువగా ఉందట. 42 శాతం పురుషులతో పోలిస్తే శారీరక శ్రమ తగినంత లేని మహిళలు 57 శాతం ఉన్నారు.
మిలీనియం ఇయర్ నుంచి పెరుగుదల..
ఇక లాన్సెట్ సర్వే ప్రకారం భారత దేశంలో 2000 సంవత్సరంలో 22 శాతం మంది శారీరకంగా ధృఢంగా ఉన్నారు. 2010 నాటికి వీరి సంఖ్య 34 శాతానికి పెరిగింది. ఇక 2022 నాటికి ఫిట్‌గా ఉన్నవారి సంఖ్య 50 శాతానికి పెరిగింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఫిట్‌గా ఉండే భారతీయుల సంఖ్య 60 శాతం దాటుతుందని లాన్సెట్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీ, పురుషులిద్దరిలోనూ శారీరక శ్రమ పెరుగతుందట.
ప్రపంచంలో ఇలా…
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు నిండినవారు) ఫిజికల్‌గా అన్‌ఫిట్ గా ఉన్నారని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో మొదటిస్థానంలో ఆసియా పసిఫిక్ రీజియన్ ఉండగా, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులు తెలిపారు.