Chicken Pox: ఎండాకాలం వచ్చిందంటే వేడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి వల్ల, ఎండల వల్ల ఎలాంటి సమస్యలు అయినా రావచ్చు. ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ వేడి చాలా ప్రమాదం. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు చికెన్ పాక్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చికెన్ పాక్స్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుచుకుంటారు. అమ్మవారు, ఆటలమ్మ, పెద్ద తల్లి, చిన్న తల్లి, తల్లి పోయడం, మాత, శీతాలమ్మ అంటూ పిలుచుకుంటారు. కానీ ఇదొక ఇన్ఫెక్షన్ అంటారు వైద్యులు.
వారిసెల్లా జోస్టర్ ద్వారా వ్యాపిస్తుందట చికెన్ పాక్స్. ఇది ఒక అంటువ్యాధి కూడా. చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తిని ముట్టుకున్నా.. వారి వద్ద ఉన్నా కూడా వెంటనే మరొక వ్యక్తికి సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో పిల్లలకు అధికంగా చికెన్ పాక్స్ వస్తుంది కాబట్టి వైరస్ సోకిన వారికి పిల్లలను దూరంగా ఉంచడమే మంచిది. కేరళలో రీసెంట్ గా చికెన్ పాక్స్ వల్ల తొమ్మిది మంది పిల్లలు మరణించారని తెలిపింది ఆరోగ్య శాఖ. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ వ్యాధి సోకుతుంది.
పిల్లల్లో, గర్భిణీలలో ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందట. గర్భిణీ స్త్రీలకు చికెన్ పాక్స్ సోకితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. పిండానికి కూడా హాని కలిగిస్తుంది ఈ అంటు వ్యాధి. ఈ వ్యాధికి సరైన చికిత్స అందించకపోతే మరణించే అవకాశం కూడా ఎక్కువే. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత మొదటి 10-20 రోజుల్లో కాలేయం, ప్లీహంలో వృద్ధి చెందుతుంది అంటున్నారు నిపుణులు. ఆ తర్వాత శరీరం మొత్తం వ్యాపిస్తుందట. రెండవ దశలో 24-48 గంటలు గడిచిన తర్వాత ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి.
జ్వరం తర్వాత ఎర్రటి పొక్కులు ఛాతి, వీపు మీద వస్తుంటాయి. ఆ తర్వాత కాళ్లు, చేతులకు కూడా వ్యాపిస్తాయి. ఈ పొక్కులు క్రమంగా పెరుగుతూ నీటి బుడగల్లా మారి మధ్యలో గుంట పడుతుంది. ఇది విపరీతమైన దురద ను కలిగి ఉంటుంది. నోటి పూత, పేగులు పొక్కడం, అజీర్తి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సొంత వైద్యం మాని వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కొందరు వేపాకు పెట్టడం, వేపాకు ముద్దలు తినిపించడం వంటివి చేస్తారు.
కొందరు చప్పటి తిండి పెడతారు. ప్రోటీన్ ఫుడ్ ను ఇవ్వరు. ఇలాంటప్పుడు వ్యాధి పెరిగే అవకాశం మరింత ఎక్కువ అంటున్నారు వైద్యులు. అందుకే పిల్లల్లో చికెన్ పాక్స్ వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని.. ఆలస్యం చేస్తే సమస్య మరింత పెరుగుతుందట. మరి జాగ్రత్త.