Kala Venkata Rao: టిడిపి సీనియర్ నాయకుడు కళా వెంకట్రావుకు దారుణ అవమానం జరిగింది. ఆయన ఇన్చార్జిగా ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును బిజెపికి కేటాయించారు. బిజెపి నడికుదిటి ఈశ్వరరావు పేరును ఖరారు చేసింది. ఈయన పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ. కళా వెంకట్రావుకు శిష్యుడు కూడా. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి గూటికి చేరారు. ఇప్పుడు గురువు సీటుకే ఎసరు పెట్టారు. అదే సమయంలో చీపురుపల్లిలో తమ్ముడు కుమారుడు కిమిడి నాగార్జునకు సైతం ఇంతవరకు టికెట్ ప్రకటించలేదు. దీంతో కళా వెంకట్రావు శిబిరంలో తీవ్ర నిరాశ అలుముకుంది.
కళా వెంకట్రావు స్వస్థలం రాజాం నియోజకవర్గం. పూర్వపు ఉణుకూరు నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు రాజకీయ కార్యకలాపాలు చేసేవారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేజిక్కించుకునేవారు. చంద్రబాబుకు సమకాలీకుడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉణుకూరు నియోజకవర్గం రాజాం గా ఆవిర్భవించింది. జనరల్ స్థానం కాస్త ఎస్సీ నియోజకవర్గం అయింది. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఎచ్చెర్ల జనరల్ గా మారింది. దీంతో కళా వెంకట్రావు ఎచ్చెర్లకు మారాల్సి వచ్చింది.
2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో.. చిరంజీవి విన్నపం మేరకు కళా వెంకట్రావు ఆ పార్టీలో చేరారు. ఎచ్చెర్ల నుంచి తొలిసారిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. దీంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి కేటాయించారు. విస్తరణలో చంద్రబాబు చోటు కల్పించారు. దీంతో సిట్టింగ్ మంత్రిగా ఉన్న ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి తప్పలేదు. అయితే ఈ ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందని ఆశించారు. తనకు కాకున్నా కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరారు. కానీ చంద్రబాబు ఇద్దరికీ మొండి చేయి చూపారు. పొత్తులో భాగంగా నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లో.. 8 సార్లు ఆ పార్టీ తరఫున కళా వెంకట్రావు పోటీ చేశారు. ఒక్క 2009లో మాత్రం పిఆర్పి తరఫున బరిలో దిగారు.ఇప్పుడు పదోసారి పోటీ చేస్తానని ఆశించినా ఆయన ఇన్చార్జిగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపి ఎగిరేసుకుపోయింది. అయితే భీమిలి, చీపురుపల్లి అసెంబ్లీ స్థానాలను, విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్లో పెట్టడంతో.. ఏదో చోట కళా వెంకట్రావుకు సీటు దక్కుతుందన్న ఆశలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.