Dengue fever : వర్షాకాలంలో ఎక్కువగా జ్వరాలు వస్తుంటాయి. వర్షాల కారణంగా ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉంటుంది. దీంతో దోమలు ఎక్కువై డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. అయితే ఇందులో డెంగ్యూ ఫీవర్ చాలా ప్రమాదకరమైనది. డెంగ్యూ వచ్చిన వెంటనే చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్న ప్రాణాల మీదకు వస్తుంది. ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అయితే ఈ ఫీవర్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా నయం అవుతుంది. మరి ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
డెంగ్యూ సోకిన వెంటనే జ్వరం వస్తుంది. ఆ తర్వాత మెల్లగా తెల్ల రక్తకణాలు పడిపోవడం, రక్తస్రావం, బీపీ తగ్గడంతోపాటు మూత్రం సరిగ్గా రాదు. నీరసం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, చర్మంపై ఎర్రని మచ్చలు, కళ్లలో, నోటిలో నుంచి రక్తం కారడం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవడం, విరేచనాలు నల్లగా అవుతున్నట్లయితే డెంగ్యూ ఉన్నట్లు అనుమానించాలి. వెంటనే టోర్నికే టెస్ట్ చేసి శరీరంలోని రక్తకణాల సంఖ్యను చెక్ చేయాలి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ డెంగ్యూలో కారణం లేని జ్వరం, రక్తస్రావంతో కలిగిన డెంగ్యూ జ్వరం, బీపీ, రక్తస్రావంతో ఉన్న డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. ఈ డెంగ్యూకి సరైన మందులు లేవు. రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంటే ఆ వ్యక్తికి ప్లేట్ లెట్స్ ఎక్కించాలి. అవసరమైతే ప్లాస్మా కూడా ఎక్కించాలి. పదివేల కంటే తక్కువగా ప్లేట్ లెట్స్ ఉంటే బయటి నుంచి వెంటనే ఎక్కించాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సీజన్‌లో తేలికపాటి జ్వరం వచ్చిన వెంటనే టెస్టులు చేసుకోవడం మంచిది. డెంగ్యూ జ్వరం నుంచి బయటపడాలంటే ముందుగా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలి. కిటికీలకు నెట్ పెట్టించుకోవాలి. దోమలు మందు కొట్టాలి. ఇంట్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంచకూడదు. మీ పెరట్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉన్న దోమలు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లో ఉండే చెత్తను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. శరీరానికి దోమలు కుట్టకుండా ఉండాలంటే వేపనూనె, లవంగం నూనె వంటివి రాసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినాలి. గోరువెచ్చని నీరు తాగుతుండాలి. ముఖ్యంగా రోగనిరోధకశక్తి ఉండేలా చూసుకోవాలి. రక్తంలో తెల్లరక్తకణాలు పడిపోవడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. వీటిని పెంచాలంటే బొప్పాయి ఆకుల జ్యూస్ తాగాలి. ఈ జ్యూస్ తాగితే తొందరగా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
డెంగ్యూ ఉంటే ఇవి చేయవద్దు
డెంగ్యూ ఫివర్ ఉన్న సమయంలో జ్వరం నివారించే బ్రూఫెన్, ఆస్ప్రిన్ వంటి మందులు పేషేంట్‌కి ఇవ్వకూడదు. అలాగే రక్తస్రావం లేనప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ముందు జాగ్రత్తగా అస్సలు ఇవ్వకూడదు. అవసరమైతేనే రక్తం ఎక్కించాలి. లేకపోతే ఎక్కించకూడదు. స్టిరాయిడ్ మందులు ఇవ్వకూడదు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రైట్స్ ట్యూబ్ వేసి కడుపులో రక్తస్రావం అవుతుందో లేదో తెలుసుకోకూడదు. ఈ ట్యూబ్స్‌తో రక్తస్రావం తగ్గించే ప్రయత్నం చేయకూడదు.