Dysfunctional Cells: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు షుగర్ రోగుల జాబితా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి షుగర్ బారిన పడితే షుగర్ ను పూర్తిస్థాయిలో తగ్గించడం సాధ్యం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మాత్రమే షుగర్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అయితే శాస్త్రవేత్తలు షుగర్ రోగులకు అదిరిపోయే తీపికబురు అందించారు. శరీరంలో సెనెసెంట్ కణాలను తొలగిస్తే షుగర్ కు బ్రేకులు వేయవచ్చని వాళ్లు చెబుతున్నారు.
ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేయగా ఈ ప్రయోగాలలో అనుకూల ఫలితాలు వచ్చాయి. కనెక్టికట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలకు డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్ ఇవ్వడం ద్వారా సెనెసెంట్ కణాలను తొలగించిన సమయంలో వాళ్లలో మధుమేహ లక్షణాలు మాయమైపోయాయని చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం వల్ల చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో, షుగర్ తో బాధ పడుతున్నారు.
కొవ్వులో ఉండే సెనెసెంట్ కణాలు కూడా మధుమేహంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించగా ఈ కణాలను తొలగించడం ద్వారా మధుమేహానికి బ్రేకులు వేయవచ్చు. అయితే మానవులలో ఈ మందుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు విసృత ప్రయోగాలు చేస్తున్నారు. మానవులలో కూడా ఇదే తరహా ఫలితాలు వస్తే షుగర్ తో బాధ పడేవాళ్లకు శుభవార్త అనే చెప్పాలి.
దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు షుగర్ తో బాధ పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. ఊబకాయల నుంచి సేకరించిన కణజాలాన్ని ఎలుకలకు అమర్చి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు చేశారు.