ENT problems : ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్య కాలుష్యం. అంతేకాదు ఇది ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న అంశం కూడా. పొల్యూషన్ చాలా మంది హెల్త్ ను దెబ్బతీస్తుంది. తాజా సర్వేలో ఈ విషయం నిజం అని తేలింది. హెల్త్‌కేర్ ప్రొవైడర్ ప్రిస్టిన్ కేర్ ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. కాలుష్యం కళ్ళను ప్రభావితం చేస్తుందట. అంతేకాదు పూర్తి ENT (చెవి, ముక్కు, గొంతు) ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. ఈ సర్వేలో ఢిల్లీ, చండీగఢ్, కాన్పూర్, నోయిడా, ఘజియాబాద్ వంటి నగరాలకు చెందిన 56,000 మందిని పరీక్షించారు. కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి అని రిపోర్ట్ లో తేలింది. అంతేకాదు ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువగా ఉండే సీజన్‌లో ముప్పు ఎక్కువగా ఉంటోందని రిపోర్ట్ తెలిపింది.
సర్వే ఫలితాలు:
కంటి సమస్యలు: 41% మంది ప్రజల్లో కంటి సమస్యలు పెరిగాయి. అది కూడా అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో నే ఈ సమస్యలు పెరిగాయి. కళ్ళు పొడిబారడం, చికాకు, మంట, ఎరుపు, దురద వంటివి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు.
ENT సమస్యలు: చెవులు, ముక్కు, గొంతు వంటి సమస్యలను 55 శాతం మంది ఎదుర్కొంటున్నారు. గొంతు నొప్పి, ముక్కులో చికాకు, చెవిలో అసౌకర్యం వంటి సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిందిట.
చికిత్స: ఈ సమస్యలు ఉన్నా సరే 68 శాతం ప్రజలు మాత్రం వైద్యులను సంప్రదించకుండా లైట్ తీసుకుంటున్నారు.
నిపుణులు ఏం చెబుతున్నారు?
ఈ సర్వే రిపోర్ట్ గురించి ప్రిస్టిన్ కేర్‌లోని ENT సర్జన్ డాక్టర్ ధీరేంద్ర సింగ్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. కాలుష్యం పిల్లలకు హానికరం అంటూ తెలిపారు. పిల్లల అభివృద్ధి చెందుతున్న శ్వాసకోశ వ్యవస్థలపై పొల్యూషన్ దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. ముక్కు, చెవుల వంటి సున్నితమైన ప్రాంతాలను ఈ కాలుష్యం చికాకుపెడుతుందని, సరిగా ట్రీట్ చేయకుండా వదిలేస్తే తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటున్నారు ధీరేంద్ర సింగ్.
ఢిల్లీ, ప్రిస్టిన్ కేర్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వైభవ్ కపూర్ కూడా ఈ విషయం స్పందించారు. కాలుష్యం ఆరోగ్య ప్రభావాలను ప్రజలు తేలికగా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. నివారణ చర్యల తక్షణ అవసరం అన్నారు. కంటి, ENT సమస్యల పెరుగుదల కాలుష్యం ఎంత ప్రమాదకరమైనదో చెబుతుందన్నారు. ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యేలోపు ప్రజలు తమను తాము రక్షించుకోవాలి అన్నారు.
కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు పెద్దగా శ్రద్ద చూపడం లేదని కూడా సర్వేలో తేలింది. నివారించడానికి ప్రజలు చాలా తక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సర్వేలో పాల్గొన్న వారిలో 35% మాత్రమే రక్షణ కళ్లద్దాలు లేదా సన్ గ్లాసెస్ ఉపయోగిస్తే 40% మంది ENT-సంబంధిత సమస్యల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అని తేలింది. అధిక కాలుష్యం ఉన్న రోజులలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే 50% కంటే ఎక్కువ మంది తమ ఆరోగ్యంపై కాలుష్యం దీర్ఘకాలిక ప్రభావాల గురించి భయపడుతున్నారు అని కూడా సర్వే తెలిపింది.