Homeహెల్త్‌Memory loss in Elderly research: వృద్ధుల మతిమరుపు పై ప్రయోగం.. ఇలా చేస్తే మెదడు...

Memory loss in Elderly research: వృద్ధుల మతిమరుపు పై ప్రయోగం.. ఇలా చేస్తే మెదడు యవ్వనం.. పూర్తి వివరాలు ఇవే..

Memory loss in Elderly research: వయసు పైబడుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం, పేర్లు మర్చిపోవడం, ఆలోచనల్లో స్పష్టత లోపించడం వంటివి సహజంగా చూస్తుంటాం. అయితే, ఈ మేధోపరమైన క్షీణతను (Cognitive decline) అడ్డుకోవడమే కాకుండా, మెదడును తిరిగి యవ్వనంగా మార్చే అద్భుతమైన రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఈ పరిశోధన, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యలకు సరికొత్త పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ పరిశోధన వివరాల్లోకి వెళితె..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు, మెదడు పనితీరు కూడా మెరుగవుతుందని మనకు తెలుసు. అయితే ఇది ఎలా జరుగుతుందనే దానిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేశారు. వ్యాయామం చేసినప్పుడు మన శరీరం నుండి కొన్ని రకాల రసాయనాలు విడుదలవుతాయి. వీటిని ‘ఎక్సర్‌కైన్స్’ (Exerkines) అంటారు. శారీరక శ్రమ ద్వారా లభించే ఈ రసాయనాలే వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ముఖ్యంగా కాలేయం నుండి విడుదలయ్యే ‘జీపీఎల్‌డీ1’ అనే ఎంజైమ్ లేదా ఎక్సర్‌కైన్ మీదే తమ దృష్టిని కేంద్రీకరించారు. సాధారణంగా వయసు పైబడిన వారిలో దీని ఉత్పత్తి తగ్గుతుంది. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వృద్ధులలో.. అలాగే వ్యాయామం చేసే ఎలుకలలో.. ఈ జీపీఎల్‌డీ1 మోతాదులు గణనీయంగా పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.

ఈ విషయాన్ని నిరూపించడానికి పరిశోధకులు వృద్ధ ఎలుకలతో కొన్ని రోజుల పాటు వ్యాయామం చేయించారు. అలా వ్యాయామం చేసిన ఎలుకల కాలేయం నుండి జీపీఎల్‌డీ1 ఎక్కువగా విడుదలైంది. ఆ తర్వాత వాటికి జ్ఞాపకశక్తి, విషయ గ్రహణ శక్తిని పరీక్షించే టాస్క్‌లను ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ వృద్ధ ఎలుకలు కూడా చిన్న వయసు ఎలుకల మాదిరిగానే ఎంతో చురుగ్గా ఆ పరీక్షల్లో నెగ్గాయి. అంటే కాలేయం నుండి వచ్చిన ఆ ఒక్క ఎంజైమ్ వృద్ధ ఎలుకల మెదడును తిరిగి యవ్వన స్థితికి తీసుకెళ్లిందన్నమాట.

శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన ప్రయోగం కూడా చేశారు. వ్యాయామం చేసిన ఎలుకల నుంచి సేకరించిన రక్తాన్ని అస్సలు వ్యాయామం చేయని వృద్ధ ఎలుకల శరీరంలోకి ఎక్కించారు. కేవలం ఈ రక్త మార్పిడి ద్వారానే, వ్యాయామం చేయని ఎలుకలలో కూడా జ్ఞాపకశక్తి పెరిగింది. వాటి మెదడులోని హిప్పోకాంపస్ లో కొత్త నాడులు పుట్టుకొచ్చాయి. దీన్ని బట్టి జీపీఎల్‌డీ1 నేరుగా మెదడును ప్రభావితం చేస్తోందని స్పష్టమైంది.

వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన మతిమరుపు వ్యాధులతో బాధపడేవారికి ఈ పరిశోధన ఒక కొత్త ఆశను చిగురింపజేస్తోంది. వృద్ధాప్యం లేదా అనారోగ్యం వల్ల శారీరకంగా వ్యాయామం చేయలేని వారికి ఈ జీపీఎల్‌డీ1 ఎంజైమ్‌ను ఒక టాబ్లెట్ లేదా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేలా భవిష్యత్తులో మందులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular