Caffeine withdrawal symptoms: ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ ముందు పనిచేసేవారి సంఖ్య ఎక్కువే. ఇలా ఆఫీసుల్లో పనిచేసేవారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డెడ్‌లైన్లు, టార్గెట్లు ఏర్పాటు చేయడం వల్ల వాటిని రీచ్ చేసేందుకు చాలా మంది రోజుకు పలుమార్లు కాఫీ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. కాఫీ తాగితే అలసట తగ్గి, చురుకుదనం పెరుగుతుందని భావిస్తారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు ఊహించని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిలో ‘కెఫిన్ విత్‌డ్రాయల్’ఒకటి. అసలేంటిది?
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వారంలో ప్రతిరోజూ 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగేవాడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కాఫీ అతని రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే వీకెండ్ రోజుల్లో ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో కాఫీ తాగకుండా ఉండేవాడు. ఇదే సమయంలో అతడికి తీవ్రమైన తలనొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో అతడు వైద్యులను సంప్రదించగా, అతడికి వచ్చిన తలనొప్పి సాధారణ మైగ్రేన్ లేదా ఇతర అనారోగ్య సమస్య కాదని తేలింది. రోజూ అధికంగా కెఫిన్ తీసుకుంటూ అకస్మాత్తుగా ఆపేయడం వల్ల వచ్చే ‘కెఫిన్ విత్‌డ్రాయల్’ లక్షణమని వైద్యులు గుర్తించారు. శరీరం కెఫిన్‌కు అలవాటు పడిన తర్వాత ఒక్కసారిగా దాన్ని నిలిపివేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
కెఫిన్ విత్‌డ్రాయల్ అంటే ఏమిటి?
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాల్లో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది అప్రమత్తతను పెంచి అలసటను తగ్గిస్తుంది. కానీ శరీరం కెఫిన్‌కు అలవాటు పడిన తర్వాత ఒక్కసారిగా దాని సరఫరా ఆగిపోతే మెదడులో రక్తనాళాల పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కెఫిన్ విత్‌డ్రాయల్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితో పాటు నిద్రమత్తు, బలహీనత, మూడ్ స్వింగ్స్, చిరాకు, పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో వికారం, కండరాల నొప్పులు కూడా కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
రోజూ ఎక్కువ కాఫీ తాగే వారు దాన్ని ఒక్కసారిగా పూర్తిగా ఆపేయకుండా క్రమంగా తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు రోజుకు నాలుగు కప్పులు తాగే వారు ముందుగా మూడు, తర్వాత రెండు కప్పులకు తగ్గిస్తూ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరం నెమ్మదిగా మార్పుకు అలవాటు పడుతుంది.
కాఫీపై ఆధారపడకుండా ఉండేందుకు తగినంత నీరు తాగడం, సరిపడా నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం, పండ్ల రసాలు లేదా హెర్బల్ టీలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి సహజ శక్తిని అందించడంలో సహాయపడతాయి.
