మనలో చాలామంది ఆహారాన్ని వేగంగా తింటూ ఉంటారు. బిజీ లైఫ్ లో చాలామంది ఆహారం తినడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే వైద్య నిపుణులు, ఫిట్ నెస్ నిపుణులు మాత్రం ఆహారం నెమ్మదిగా తినాలని సూచనలు చేస్తున్నారు. నమిలి ఆహారం తినడం ద్వారా బరువు అదుపులో ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కష్టతరమైన వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ విధంగా చేస్తే మంచిది.
ఆహారాన్ని బాగా నమలడం ద్వారా కేలరీల శాతం తగ్గడంతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. నెమ్మదిగా తినడం వల్ల 12 శాతం బరువు తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారాన్ని నమిలి తీసుకునే వారిలో చర్మం త్వరగా ముడతలు పడదని ఎక్కువ సమయం నమలడం ద్వారా శరీరంలో మెటబాలిజం పెరిగి కండరాలు శ్రమిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
వేగంగా తినడం వల్ల ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. వేగంగా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు కూడా సరిగ్గా అందవు. వేగంగా భోజనం తింటే మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని పూర్తిగా నమలడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం నెమ్మదిగా తినడం వల్ల ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనం సాగించవచ్చు.
పెద్దలతో పోలిస్తే పిల్లలు ఆహారాన్ని వేగంగా తింటూ ఉంటారు. పిల్లలకు చిన్నతనం నుంచే సరైన ఆహారపు అలవాట్లను నేర్పించాలి. వేగంగా ఆహారం తినడం వల్ల నష్టాలే తప్ప శరీరానికి ఎటువంటి లాభాలు ఉండవు.