Sleep Crisis: ప్రతి మనిషికి కంటి నిండా నిద్ర, కడుపునిండా తిండి అనేది అత్యంత ముఖ్యం. ఈ రెండిట్లో ఏది లేకున్నా.. అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో చాలామంది ఆస్తమానం దానికే అతుక్కుపోతున్నారు. కనీసం పక్కన ఉన్న మనిషితో కూడా మాట్లాడలేకపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఫోన్ తోనే సహవాసం చేస్తున్న నేపథ్యంలో చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రముఖమైనది కంటి నిండా నిద్ర లేకపోవడం. అదే పనిగా ఫోన్ చూడటం వల్ల కంటి చూపు మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. అంతేకాదు అది నిద్రను కూడా దూరం చేస్తుంది. ఇలా సరిగా నిద్ర పోకపోతే శరీరం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఒక మనిషికి సగటున ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం. కంటి నిండా నిద్రపోవడం వల్ల శారీరక శ్రమ, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెదడుకు విశ్రాంతి అందుతుంది. ఆదమరచి నిద్ర పోవడం వల్ల శరీరం పునరుత్తేజాన్ని పొందుతుంది.
జ్ఞాపకాల పునరుత్తేజం
నిద్రలో ఉన్నప్పుడు మెదడులో “రాపిడ్ ఐ మూమెంట్” చోటు చేసుకుంటుంది. దీనివల్ల జ్ఞాపకాలు పునరుత్తేజమవుతాయి.. మెదడు సరికొత్తగా పనిచేస్తుంది. ఏకాగ్రత, భావోద్వేగాల నియంత్రణ వంటివి మెదడు స్టోర్ చేసుకుంటుంది. నిద్ర లేకపోతే ఇవన్నీ సాధ్యం కావు. మెదడు మీద ఒత్తిడి పడి, అనేక రకాల సమస్యలు చోటుచేసుకుంటాయి. నిద్ర వల్ల మెదడులో సెరటోనిన్, డోప మైన్, నోర్ పైన్ ఫ్రైన్ వంటివి సమతుల్యానికి గురవుతాయి.. న్యూరో ట్రాన్స్మిటర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గ్లిమ్ పాటిక్ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. మెదడులో పేరుకుపోయిన వ్యర్ధాలు మొత్తం తొలగిపోతాయి.
కొత్త న్యూరల్ కనెక్షన్ ల ఏర్పాటు
నిద్ర వల్ల మెదడులో” స్లీప్ సినాప్టిక్ ప్లాస్టిక్ సిటీ” ఉత్తేజితమవుతుంది. దీనివల్ల కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఉన్న వాటిని భద్రం చేసుకునేందుకు, కొత్త వాటిని మెరుగుపరుచుకునేందుకు న్యూరల్ కనెక్షన్లు తోడ్పడతాయి. నిద్ర వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ కూడా సాధ్యమవుతుంది. కార్టిసాల్, మెలటోనిన్, వంటి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని నిద్ర పెంపొందిస్తుంది. అనారోగ్యాలు, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
దీర్ఘకాలికమైన నిద్రలేమి వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్, న్యూరో డి జనరేటివ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు కంటి నిండా నిద్రపోవడమే మంచిది. శారీరక వ్యాయామం, సమతుల ఆహారం, ధారాళంగా గాలివీచే పరిసరాలు వంటివి నిద్రకు ఉపక్రమించేలా చేస్తాయి. సాధ్యమైనంతవరకు టీ, కాఫీలను మితంగా తీసుకోవాలి. వీటి వాడకం ఎక్కువైతే అవి అంతిమంగా నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి.
(ఈ కంటెంట్ వివిధ రకాలైన నిపుణుల అభిప్రాయాలను తీసుకొని రూపొందించాం. నిద్రలేమి తో బాధపడుతున్న వారు కచ్చితంగా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది)