Soy Milk: మనలో చాలామంది అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. పాలు, పాల సంబంధిత పదార్థాలను తినేవాళ్లలో కొంతమందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు వేగన్ పాలు తాగితే మంచిది. ప్రపంచ దేశాల్లోని జనాభా సోయా పాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పలు అధ్యయనాలలో సైతం సోయా పాలు అత్యంత శ్రేష్టమైన పాలు అని వెల్లడైంది. ఆవుపాలను సోయా పాలు ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.
సోయాబీన్స్ నుంచి సోయా మిల్క్ తయారు చేయగా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఇనుము, ఫాస్ఫరస్, నియాసిన్, విటమిన్-సి సోయాపాల ద్వారా లభిస్తాయి. సోయా పాలు తాగడం ద్వారా ఊబకాయం నుండి రక్తపోటు వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సోయాలోని ఐసోఫ్లేవిన్స్ అనే రసాయనాలు కేన్సర్ నుంచి రక్షణ కలిగించడంలో ఉపయోగపడతాయి.
బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచే సామర్థ్యం సోయాపాలలో అధికంగా ఉంటుంది. రక్త ప్రవాహంలోకి కొలెస్ట్రాల్ రవాణాను నివారించడంలో సోయాలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడతాయి. రక్తనాళాల గాయాలను తగ్గించడంతో పాటు రక్తస్రావం నుంచి సమర్థవంతంగా కాపాడటంలో సోయా మిల్క్ ఉపయోగపడుతుంది. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
సోయా పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ లభించడంతో పాటు ఈ పాలు తాగేవాళ్లకు ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తక్కువని చెప్పవచ్చు. సోయా పాలలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ మహిళలలో ఈస్ట్రోజెన్ ను భర్తీ చేయడంతో పాటు మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.