Junk Food
Junk Food: మీరు చివరిసారి జంక్ ఫుడ్ ఎప్పుడు తిన్నారు? ‘..ఎప్పుడోనా? పిజ్జా తిని ఇంకా గంట కూడా కాలేదు. అయినా పానీ పూరీకి రెడీగా ఉన్నాం ఇక్కడ!’ అని చెప్పేవారు చాలామందే ఉంటారు. పైగా ‘ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా’ అంటూ ఖైలాశ్ ఖేర్ లెవల్లో పాటేసుకుంటారు. తినొద్దని ఎవ్వరూ అనరు. కానీ జంక్ ఫుడ్ తింటేనే సమస్యంతా! సడెన్‌గా జంక్ ఫుడ్ ఆపేస్తే బుర్ర ఫ్రై అయిపోతుంది. మెలమెల్లగా జంక్‌కి బంక్ కొట్టి చూడండి..! బరువు తగ్గి..గాల్లో తేలినట్టు ఉంటుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు!
జంక్‌ఫుడ్ తినడం ఆపేస్తే ఏం జరుగుతుంది? కాలేజ్‌కి బంక్ కొడితే ప్రాబ్లమ్‌గానీ, జంక్‌కి బంక్ కొడితే నష్టమేం లేదు! ఒంట్లో కొవ్వును పెంచేసే హై కేలరీ జంక్ ఫుడ్‌ని దూరంపెడితే బరువు తగ్గడం ఖాయం! సాయంత్రమైతే మిరపకాయ బజ్జీలు, కార్న్ సమోసాలు తినేసి.. పానీపూరి జుర్రుకునే ప్రాణాలకు.. ఒక్కసారి జంక్ ఫుడ్ మానేయడం కష్టమే! అందుకే నెమ్మది నెమ్మదిగా జంక్ ఫుడ్‌ని దూరం పెట్టాలంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు! ఒకేసారి తినడం మానేస్తే, తలనొప్పి, చికాకు, నీరసం వస్తాయని చెబుతున్నారు. అయితే కాస్త ఓపిక పడితే శరీరంలో కొత్త ఉత్తేజం నిండుతుందని చెబుతున్నారు.
హెల్త్ రిస్క్ తగ్గుతుంది
ఫ్రెంచ్ ఫ్రైస్, చీస్ బర్గర్లు ఇతర ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ వాటితో గుండెజబ్బులు, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఖాయం! జంక్‌ఫుడ్‌లోని సోడియం.. హై బీపీకి, కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది. డైట్‌లో జంక్‌ఫుడ్ లేకుండా చూసుకుంటే.. ప్రాణాంతక రోగాలు మీ దరిచేరవని చెబుతున్నారు డైటీషియన్లు.
మెరిసే చర్మం మీ సొంతం
మీరేం తింటున్నారో మీ చర్మం చెప్పేస్తుంది. మనం తినే ఆహారాన్నిబట్టే చర్మ సౌందర్యం
ఆధారపడివుంటుంది. జంక్ ఫుడ్‌ని మానేసిన రోజు నుంచి మీ చర్మం కాంతివంతం అవుతుందంటున్నారు వైద్యులు.
మూడ్ బాగుంటుంది
ప్రోసెస్డ్ ఫుడ్ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. జంక్‌ఫుడ్ తింటూపోతే శరీరానికి పోషకాలు అందవు. దాంతో శరీర సమతుల్యం దెబ్బతింటుంది. చికాకు, కోపం పెరుగుతాయి. శరీరానికి తగినంత పోషకాలు అందితే జీవక్రియలు సక్రమంగా జరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మంచి నిద్ర
కలత నిద్రతో కలవరపడుతున్నారా? దానికి జంక్ ఫుడ్డే కారణం! స్వీట్లు, కొవ్వు పదార్థాలతో బరువు పెరగడమేకాదు నిద్ర కూడా చెడిపోతుంది. జంక్ ఫుడ్‌ని మానుకుంటే చక్కని నిద్ర పడుతుంది. మర్నాడు తాజాగా ఉంటుంది.
కండరాలు బలపడతాయి
ప్రోసెస్డ్ ఫుడ్‌కి గుడ్‌బై చెప్పి.. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. శరీరం ధృఢంగా ఉంటుంది.
బరువు తగ్గి ఉల్లాసం
కరకరలాడే పొటాటో చిప్స్, నోరూరించే చీస్ బర్గర్లు టెంప్ట్ చేస్తూనే ఉంటాయి. అయితే కాస్త నిగ్రహం పాటిస్తే..నిండైన ఆరోగ్యం మీసొంత మంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. జంక్ ఫుడ్ తినడం మానేసిన కొద్దిరోజుల్లోనే బరువు, కొలెస్ట్రాల్ తగ్గి ఉల్లాసం నిండుతుందనీ..బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణస్థాయికి వచ్చి.. టైప్-2 డయాబెటిస్ ముప్పు తప్పుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
పౌష్టికాహారానికి చోటు
జంక్ ఫుడ్‌ని ఎప్పుడైతే మానేశారో..పౌష్టికాహారం తీసుకోవడానికి పొట్టలో చోటు దొరుకుతుంది. జంక్ ఫుడ్ స్థానంలో పళ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల..శరీరానికి అత్యవసరమైన ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు అందుతాయి.
మొత్తంమ్మీద ఏళ్లకు ఏళ్లుగా బంకలా అంటుకున్న జంక్ ఫుడ్ అలవాటును మానుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆహ్వానించినట్టే! అయితే ఒకేసారి ఆపేయకుండా.. మార్పుకు మీ శరీరం అలవాటుపడేంత వరకూ జాగ్రత్తలు తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ లు సూస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Disadvantages of eating junk food
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com