Daytime Sleepiness Causes: ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మందికి కార్యాలయాల్లో, వ్యాపార ప్రదేశాల్లో మధ్యాహ్నం నిద్ర మత్తు ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రి సమయంలో మాత్రం నిద్ర పట్టడానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇవి కేవలం అలసట లక్షణాలు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఇటీవల తేలిన పరిశోధనల ప్రకారం.. పై లక్షణాలతో ఈ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆవేంటంటే?
పరిశోధనలో ఏమి తేలింది?
అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పగటిపూట ఎక్కువగా నిద్రమత్తుతో బాధపడే వ్యక్తులు, అలాగే రాత్రి పడుకున్న తర్వాత వెంటనే నిద్రపట్టని వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు సమస్యలు ఒకేసారి ఉంటే హైబీపీ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
నిద్రకు, రక్తపోటుకు ఉన్న సంబంధం
మన గుండె, రక్తనాళాల వ్యవస్థ రోజంతా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఈ వ్యవస్థకు విశ్రాంతి లభించే ముఖ్యమైన సమయం నిద్ర. నిద్ర సమయంలో గుండె స్పందన రేటు తగ్గుతుంది. రక్తపోటు కూడా సహజంగా తగ్గి శరీరం కోలుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే నిద్రకు అంతరాయం కలిగితే లేదా తగినంత సమయం నిద్రపోకపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా రక్తపోటు స్థాయిలు క్రమంగా పెరుగుతాయి.
నిద్రలేమి శరీరంపై చూపే ప్రభావం
సరిగా నిద్ర పట్టకపోతే శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. దీంతో ఒత్తిడిని నియంత్రించే నాడీ వ్యవస్థ ఎక్కువగా ఉత్తేజిత స్థితిలో ఉంటుంది. ఈ పరిస్థితిలో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తనాళాలు కుదించుకోవడం జరుగుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు నిద్రలేమి కొనసాగితే శరీరం ఎప్పుడూ అప్రమత్త స్థితిలోనే ఉండిపోతుంది. ఇది హైబీపీతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
స్లీప్ అప్నియా కూడా ప్రమాదకరం
కొంతమందిలో నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడే ‘స్లీప్ అప్నియా’ సమస్య ఉంటుంది. ఈ పరిస్థితిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోతుంది. అనంతరం గట్టిగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటారు. ఇలా ప్రతి సారి శ్వాస ఆగినప్పుడు రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి తరచూ జరుగుతుంటే దీర్ఘకాలంలో హైబీపీ సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక ఆరోగ్య సవాళ్లు
నిద్ర సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కేవలం రక్తపోటే కాదు, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు రక్తనాళాలపై అదనపు ఒత్తిడిని కలిగించి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే నిద్ర నాణ్యతను మెరుగుపరచడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.
జీవనశైలిపై ప్రభావం
నిద్రలేమితో బాధపడేవారిలో అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీంతో వ్యాయామం చేయాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. అదే సమయంలో అధిక కాఫీ, టీ వినియోగం పెరగడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు ఏర్పడటం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ పరోక్షంగా రక్తపోటును మరింత పెంచే అవకాశముంది.
అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లను చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించడం లేదా ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలు తీసుకోవడం మానుకోవాలి. అలాగే మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం మంచిది.
