Andhra Pradesh Gold Mine: దేశంలోనే బంగారమైన ఘన చరిత్రను సొంతం చేసుకోనుంది ఏపీ. భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే అరుదైన ఛాన్స్ దక్కించుకోనుంది. రాబోయే రోజుల్లో అతిపెద్ద బంగారు సరఫరాదారుగా ఏపీ అవతరించనుంది. రాయలసీమలో ఉన్న బంగారు గని దీనిని నిజం చేయనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా బంగారం వెతికితీత విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. రాష్ట్ర గనుల చరిత్రలోనే ఒకసారి కొత్త అధ్యాయం మొదలుకానుంది.
* రేపు సీఎం చేతుల మీదుగా..
జొన్నగిరి బంగారు గనుల ప్రాజెక్టును రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పూర్తిస్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని మరో 12 ఎకరాలు విస్తీర్ణంలో కొత్త తవ్వకాల కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో యూనిట్ ను కూడా సీఎం భూమి పూజ చేయనున్నారు. దీంతో ఏపీ దేశంలో బంగారం ఉత్పత్తి చేసి ముఖ్య రాష్ట్రాల జాబితాలో చేరనుంది. గతంలో జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు తరచూ లభించేవి. ఈ నేపథ్యంలో జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఇక్కడ విస్తృత సర్వేలు చేపట్టారు. పరిశోధనలు భారీ స్థాయిలో బంగారం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడి ఖనిజాన్ని పూర్తిస్థాయిలో వెలికి తీసేందుకు అవసరమైన అనుమతులు, పరిశోధనలు, సాంకేతిక అధ్యయనాలను విజయవంతంగా పూర్తి చేశారు. అందుకే ఇప్పుడు ఈ ప్లాంట్ ఉత్పత్తి దశకు చేరుకుంది.
* గత రెండు దశాబ్దాలుగా..
జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బంగారం ఖనిజం ఉన్నట్టు నిర్ధారణ కావడంతో.. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 2006లో సుమారు 1477 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు లభించాయి. మొదట చిన్న స్థాయిలో తవ్వకాలు చేపట్టారు. ఖనిజ నాణ్యతను పరీక్షించారు. ఆ పరీక్షల్లో బంగారం ఖనిజం నాణ్యమైనదని తేలడంతో సంస్థ ముందుగా మినీ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. అనంతరం 320 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన భారీ ప్రాసెసింగ్ ప్లాంట్ ను నిర్మించింది. దాదాపు 800 మంది ఇక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
* కూటమి వచ్చిన తర్వాత..
గత కొంతకాలంగా ఉత్పత్తికి సిద్ధమయ్యింది ఈ ప్లాంట్. కానీ అనుమతుల్లో జాప్యం జరగడంతో ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ అంశాలను పరిష్కరించడంతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. దీంతో మిగిలిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆట వెయ్యి కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేయగల స్థాయిలో ఖనిజాన్ని వెలికి తీసినట్లు ఇక్కడ అధికారులు చెబుతున్నారు. జియో మైసూర్ సంస్థ నిర్వహించిన సర్వేలో జొన్నగిరి ప్రాంతంలో సుమారు కోటి టన్నుల వరకు బంగారం ఖనిజం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రారంభ దశలో రోజుకు ఒక కిలో బంగారం ఉత్పత్తి చేనుండగా.. తదుపరి దశల్లో వార్షిక ఉత్పత్తిని 600 కిలోల నుంచి 1500 కిలోల వరకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాబోయే 15 సంవత్సరాలు పాటు ఈ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే ఒక్క జొన్నగిరి మాత్రమే కాదు అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో కూడా గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కూడా త్వరలో తవ్వకాలు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో బంగారు ఖనిజ నిక్షేపాలు గుర్తించబడ్డాయి. ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ గోల్డ్ మైనింగ్ హబ్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
