దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో బెడ్స్, ఆక్సిజన్, మందులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటినుంచే చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
అయితే కరోనా బాధితుల్లో కడుపు నొప్పి, విరేచనాలు లక్షణాలు ఉంటే వీళ్లు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందిని బలహీనత, జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా వైరస్ శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుండటం గమనార్హం.
కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమందిలో పొడిదగ్గు లక్షణం కనిపిస్తోంది. రుచి, వాసన కోల్పోవడం, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు మరి కొందరిలో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ లివర్ ను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెపటాలజీ చీఫ్ డైరెక్టర్ గురుగ్రామ్ అవ్నిష్ సేథ్ వెల్లడించడం గమనార్హం. కరోనా సోకిన వారిలో 19 శాతం మందిని కాలేయ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం కాలేయ సంబంధిత సమస్యలు తాత్కాలికంగా ఉంటాయని వెల్లడించినట్లు తెలుస్తోంది.