
కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ చూడనంతగా మే నెలలో కేసులు వెలుగు చూశాయి. ఒక దశలో రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదు కావడం దారుణం. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. మరణాల సంఖ్య సైతం ప్రమాదకరస్థాయికి చేరింది. ఏదేశంలో నమోదు కాని కేసులు భారత్ లో వెలుగు చూశాయి. మే నెలలోనే మరణాలు 33 శాతం చోటుచేసుకోవడంతో తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. గణాంకాలు సైతం భయపెట్టాయి.
కరోనా కేసులు మే నెలలో 90.3 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచంలోనే నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో కరోనా ఉధృతి ని తెలుసుకోవచ్చు. ఇండియాలో జనాభాకనుగుణంగా కేసులు కూడా అదే రేంజిలో పె రగం యాదృచ్చికం కాదు. మన నిర్లక్ష్యం కారణంగానే కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి పాలకులు,ప్రజలు అందరు బాధ్యులే.
మే నెలలో నమోదైన మరణాల సంఖ్య దాదాపు 1.2 లక్షలు.ఏ దేశంలో ఒక నెలలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. తర్వాత స్థానంలో అమెరికా ఉంది. అక్కడ ఈ ఏడాది జనవరిలో 99.680 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈనెలలో గంటకు దాదాపు 165 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం యావత్తు ఆందోళనలో పడిపోయింది.
మే 19న రికార్డు స్థాయిలో 4,529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. 2020 భారత్లో నమోదైన మరణాల సంఖ్య 1.48 లక్షలు. ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు అంతే సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరణాల రేటు మే నెలలో ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ మరణాల రేటు 2.9 శాతం కాగా దేశ సరాసరి (1.3 శాతం)తో పోల్చితే ఇది రెండు రెట్ల కంటే ఎక్కువ. ఢిల్లీలో మే నెలలో8,090 మరణాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ లో 2.8 ఉత్తరాఖండ్ లో 2.7 శాతాలతో జాతీయ సరాసరి కంటే ఎక్కు వ మరణాలు నమోదయ్యాయి.