Cool Drinks : కాస్త ఎండ అనిపించినా.. లేదా నలుగురు ఒకే చోట కలిసినా.. వెంటనే కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ కూడా ఇళ్లలో ఉంచుకుని పిల్లలకు కూడా వాటిని తాగిస్తుంటారు… దీనితో పిల్లలు కూడా ఎక్కడికి వెళ్లినా కూల్ డ్రింక్స్ కావాలని మారం చేస్తుంటారు.. ఒకప్పుడు వేసవిలో మాత్రమే శీతల పానీయాలు ఎక్కువగా తీసుకునేవారు. ఇప్పుడు ఆ సీజన్‌తో సంబంధం లేకుండా వాటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఈ శీతల పానీయాలు ఏ వయసులో ఉన్న వాళ్లకు అయినా హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాల దుష్ప్రభావాల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. శీతల పానీయాలు (Sugar-Sweetened Beverages) తాగడం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. SSB (Sugar-Sweetened Beverages) ల వల్ల అధిక బరువు, షుగర్ వస్తుందని, కౌలెస్ట్రాల్, బీపీ పెరిగి గుండె జబ్బులు వస్తాయని తెలిపారు. కూల్ డ్రింక్స్ తాగడం మూలానా అనారోగ్యం పాలై 2020లో 3.4 లక్షల మంది చనిపోయారని వైద్యులు తెలిపారు. పట్టణ యువత, చదువుకున్న వాళ్లే వీటిని అధికంగా సేవిస్తున్నారు. నిజానికి, శీతల పానీయాలలో రిఫ్రెషింగ్‌గా భావించే అంశాలు ఉంటాయి.. అయితే. వాటి రెగ్యులర్ వినియోగం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ పిల్లలకు శీతల పానీయాలు ఇచ్చే ముందు, దాని ప్రమాదాలను మీరు తెలుసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దంతాలకు నష్టం
శీతల పానీయాలలో ఉండే చక్కెర, యాసిడ్స్ దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తాయి. ఇది దంతక్షయం, నొప్పికి కారణమవుతుంది.
శరీరంలో నీరు లేకపోవడం
శీతల పానీయాలు రిఫ్రెషింగ్‌గా అనిపించవచ్చు.. కానీ అవి శరీరాన్ని హైడ్రేట్ చేయవు. తీపి పానీయాలు మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తాయి.. దీనివల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
ఊబకాయం
శీతల పానీయాలలో చక్కెర అధికంగా ఉంటుంది.. ఇది పిల్లలలో ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, వారికి పోషకాలు లోపిస్తాయి. దీని కారణంగా, పిల్లలు అవసరమైన విటమిన్లు, ఖనిజాల లోపంతో బాధపడవచ్చు.
జీర్ణ సమస్యలు
శీతల పానీయాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ఇది పిల్లలలో కడుపు నొప్పి, గ్యాస్ లేదా మలబద్ధకానికి కారణమవుతుంది.
ఎముకలు బలహీనపడటం
శీతల పానీయాలలో తక్కువ కాల్షియం ఉంటుంది. ఎముకల అభివృద్ధికి కాల్షియం అవసరం. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిల్లలలో ఎముకలు బలహీనపడతాయి.
పిల్లలకు ఏమి ఇవ్వాలి?
పిల్లలకు శీతల పానీయాలకు బదులుగా సాదా నీరు, తాజా పండ్లు, పండ్ల రసాలు (నీటితో కలిపినవి) లేదా మజ్జిగ ఇవ్వడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి వారిని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.