Constipation in winter : మామూలు రోజులతో పోలిస్తే వింటర్ సీజన్లో జీర్ణక్రియ మందగిస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు విటమిన్ డి అందకపోతే ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. చాలా మంది చలికాలంలో తీసుకునే ఆహారం విషయంలో అశ్రద్ధ చూపుతుంటారు. అందుకే మలబద్ధకం సమస్య మరింత పెరుగుతుంది. ఆహారం వల్ల మాత్రమే కాదు.. చలికాలంలో వారు ఫాలో అయ్యే కొన్ని అనారోగ్యకర అలవాట్లు మలబద్ధకం సమస్య వచ్చేలా చేస్తాయట. అందుకే కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
నీరు తాగడం : చాలా మంది మామూలు సమయంలోనే నీరు తాగడానికి ఇష్టపడరు. ఇక చలికాలంలో నీరు తాగాలంటే అమ్మో అంటారు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది నీరు తాగరు. అందుకే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. దీంతో ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక.. మలం పేగుల్లో గట్టిపడుతుంది. దాంతో పేగు కదలికల్లో ఇబ్బందులు వస్తాయట. అంతేకాదు మలబద్ధకం ప్రాబ్లం ఎక్కువ అవుతుంటుంది.
ఫైబర్ తీసుకోవడం : జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే బాడీకి తగిన మొత్తంలో ఫైబర్ అవసరం. ప్రస్తుతం చాలా మంది జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే ఫ్యాట్స్, చక్కెర స్థాయిలు ఈ ఆహారంలో ఎక్కువ ఉంటాయి. ఫైబర్ అసలు ఉండదు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. తద్వారా మలబద్ధకం వస్తుంది. కాబట్టి ఏ కాలమైనా శరీరానికి సరిపడా ఫైబర్ తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.
టీ, కాఫీలు : చాలా మంది చలికాలంలో టీ, కాఫీలు ఎక్కువ తాగుతారు. చలికి వేడి వేడిగా టీ,కాఫీలు తాగాలి అనిపిస్తుంది. దీని వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కెఫిన్ శరీరంలో పేరుకుపోయి డీహైడ్రేషన్ ను కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. పేగు కదలికల్లో అంతరాయం కలిగి మలబద్ధకం వస్తుంది.
వ్యాయామం : మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం కచ్చితంగా చేయాలి. ఉదయం చాలా చలిగా ఉంటుంది కాబట్టి వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. మార్నింగ్ చలి ఉందని, మంచు కమ్మేసిందని వాకింగ్ కి వెళ్లరు. . దీంతో బాడీ కూడా రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరానికి తగినంత శ్రమ లభించదు. సో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో మలబద్ధకం వచ్చే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది.
మందులు వాడటం : చలికాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు కామన్ గా వస్తుంటాయి. అందుకే మందులు వాడుతుంటారు. అయితే ఈ సమయంలో మీరు వాడే కొన్ని మందులు మలబద్దకాన్ని కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కోల్డ్ రెమిడీస్, పెయిన్ రిలీవర్స్ వంటి మందులు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి కూడా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంటాయి. మరో ముఖ్యమైన విషయం వెదర్ కూల్ గా ఉందని బాత్రూమ్ కు వెళ్లకుండా ఉండవద్దు. దీని వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. సో జాగ్రత్త.