Chicken Skin Disease: మనిషి శరీరానికి ఒక ఆకృతిని.. అంతర్గత అవయవాలకు రక్షణను ఇచ్చేది చర్మం. మనిషి దేహంలో అతిపెద్ద అవయవం కూడా చర్మమే. మనుషులు నివసించే ప్రాంతాలు.. వారి తల్లిదండ్రుల జన్యువులు, వంశపారంపర్య చరిత్ర ఆధారంగా మనుషుల చర్మం ఆధారపడి ఉంటుంది. శీతల వాతావరణంలో ఉన్నవారు తెల్లగా ఉంటారు. ఎండ ప్రాంతంలో నివసించేవారు నల్లగా ఉంటారు. భౌగోళిక వాతావరణం బట్టి చర్మంలో రంగులు ఉంటాయి. అయితే కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా రకరకాల చర్మ సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి. అందులో కొన్ని సమస్యలు కొన్ని రోజులకు తగ్గిపోతుంటాయి. కానీ కొందర్ని చర్మ సమస్యలు జీవితాంతం ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాటిల్లో క్షోభి తర్వాత.. అత్యంత ఇబ్బందికరమైనది చికెన్ స్కిన్.. ఎండాకాలం లో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. మిగతా కాలంలో అదుపులో ఉన్నప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎండలు దంచి కొడుతున్న వేళ చికెన్ స్కిన్ నుంచి ఎలా రక్షించుకోవాలంటే..
వైద్య పరిభాషలో చికెన్ స్కిన్ ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి ఉన్నవారు చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. అవి క్రమేపి గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది మరీ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది.
ఈ వ్యాధి సోకే ఎందుకు ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.
చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి ఉపశమనం పొందాలంటే.. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ జంటతో కూడిన మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు ఆ గడ్డలను తరచూ గిల్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్ తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. (ఈ సమాచారం వివిధ రకాల అధ్యయనాలు, వైద్యరంగ నిపుణుల సూచనల ప్రకారమే మీకు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు.. మీరు వైద్యులను కలవడం ఎందుకైనా మంచిది)