Burnout Syndrome: ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందితే జీవితం గెలిచినట్లే అని అనుకున్నారు. అంతేకాకుండా కొందరు సంబంధాలు కలుపుకోవడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం వెతికేవారు. లక్షల్లో జీతం.. సకల సౌకర్యాలు.. కావలసిన సెలవులు ఇందులో ఉండడం వల్ల ఈ జాబ్ కోసం చాలామంది ఆరాటపడేవారు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నారు. ఈ జాబ్ చేస్తున్నారంటే వారికి దూరంగా ఉంటున్నారు.. ఎందుకంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. చాలామందిలో మానసిక ఒత్తిడి పెరిగి బర్నౌట్ సిండ్రోమ్ కి దారితీస్తుంది. అసలు ఈ బర్నౌట్ సీన్ రూమ్ అంటే ఏమిటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి?
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే పూర్తిగా శారీరకంగా శ్రమలేని జాబ్. అంతేకాకుండా కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చొని చేయాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీల్లో అయితే రోజుకు 18 గంటలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం టెన్షన్ పడే వాతావరణం ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. దీంతో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు నీరసంగా కనిపించడం.. చేసే పని పట్ల ఆసక్తి లేకపోవడం.. తరచూ తప్పులు చేయడం.. విషయాలన్నీ మర్చిపోవడం.. చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం వంటివి ఉంటున్నాయి. వీటినే బర్నౌట్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక వ్యక్తి మానసిక, వ్యక్తిగత పనులకు మధ్య సమతుల్యం లేకపోవడం వల్ల అనేక పనులు సమర్థవంతంగా చేయకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
బర్నౌట్ సిండ్రోమ్ అనేది కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మాత్రమే కాదు.. ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొనే ఉద్యోగుల్లో కూడా కనిపిస్తుంది. అలాగే ఏదో ఒక సమస్యతో బాధపడేవారు.. ఎక్కువగా ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టడం.. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేయడం.. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్న ఆలోచనలతో మానసిక స్థితి సరిగ్గా ఉండలేక పోతుంది. దీంతో రోజువారి అలవాట్లను కూడా సక్రమంగా చేసుకోలేకపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇతర దీర్ఘకాలిక వ్యాధులపై ప్రభావం చూపి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
అయితే ఈ సమస్య ఉన్నవారు వీటి నుంచి బయటపడడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోకుండా కనీసం గంట తర్వాత లేచి నిలబడడం లేదా అటు ఇటు తిరగడం వంటివి చేయాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడం.. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వారంలో ఐదు రోజులు ఒత్తిడితో పని చేస్తారు.. కాబట్టి మిగతా రెండు రోజులు ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాలి. లేదా స్నేహితులను కలిసి ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.