Jagan: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. రాజకీయ కారణాలతో అసెంబ్లీని ఆ పార్టీ బహిష్కరించింది. శాసనమండలికి ఆ పార్టీ ఎమ్మెల్సీలు వెళుతున్నారు కానీ.. ఆశించిన స్థాయిలో రాజకీయ మైలేజ్ తగ్గడం లేదు. ప్రజలు చట్టసభల్లో తమ వాణిని వినిపించాలని ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలు చట్టసభలకు హాజరు కావడం లేదు. 2019లో 23 స్థానాలకే పరిమితం అయింది తెలుగుదేశం పార్టీ. కానీ సభకు హాజరయ్యింది. ఉమ్మడి ఏపీలోనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రి.. ఆపై ఎక్కువగా కాలం ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మాత్రం దానిని ఒక బాధ్యతగానే స్వీకరించారు. అంతటి సీనియర్ నేత కూడా సభకు హాజరై సభా మర్యాదలు పాటించారు. హుందాతనంతో వ్యవహరించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మితిమీరిన ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు సహించలేక సభను బహిష్కరించారు. కానీ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఎటువంటి హుందాతనం పాటించలేకపోయారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అవమానాలను గుర్తుచేసుకొని.. అదే పరిస్థితి ఉంటుందని భావించి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.
* నేషనల్ మీడియా సైతం..
ఒక ఎమ్మెల్యే సభలో ఉంటేనే గౌరవం.. శాసనసభలో సమస్యలు ప్రస్తావిస్తేనే హుందాతనం. బయట ఎన్నెన్ని మాట్లాడినా అది పెద్దగా పరిగణలోకి రాదు. జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తనకు అనుకూల మీడియాతో సమావేశాలు పెడుతున్నారు. వారు కూడా చివరికి అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ నేషనల్ మీడియా ప్రతినిధి ఇక్కడ ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి చెప్పవచ్చు అనేసరికి జగన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే జగన్ రాజకీయాన్ని గొప్పగా ప్రమోట్ చేసే నేషనల్ మీడియా సైతం.. ఇప్పుడు ఆయన రాజకీయాన్ని తప్పుపడుతోంది. నేరుగా రాజకీయ విమర్శనాత్మక కథనాలను ప్రసారం చేస్తోంది.
* ప్రజల్లోకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రకటనలు
ఒక విధంగా చెప్పాలంటే ప్రజల్లో కూడా ఇది ఒక చులకన భావమే. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను సభకు వస్తానని జగన్ చెబుతున్నారు. అది చిన్న పిల్లాడి చాక్లెట్ తగాదా మాదిరిగా ఉంది. అది మేం ఇచ్చేది కాదు అని చెబుతున్నారు సీఎం చంద్రబాబు, సభాపతి అయ్యన్నపాత్రుడు. కానీ ఊరుకునేది లేదని.. తనకు ఆయుధం ఇస్తేనే యుద్ధం చేస్తానని చెప్పి.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటూ మెలిక పెడుతున్నారు. అయితే స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సైతం ప్రజల్లోకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరును తీసుకెళ్తున్నారు. చర్చ జరిగేలా చూస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరును నిరసిస్తున్నారు. అయితే ఇది క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వరకు వెళ్ళింది.
* ఒత్తిడికి తలొగ్గి..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చాలా సమావేశాలకు చంద్రబాబు వెళ్లారు. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మితిమీరిన దాడి జరిపారో.. అప్పుడే చంద్రబాబు( CM Chandrababu) శపధం చేశారు. మళ్లీ సీఎం గానే హౌస్ లో అడుగుపెడతానని తేల్చి చెప్పారు. అయితే తాను ఒక్కడినే బహిష్కరిస్తానని చెప్పుకున్న ఆయన.. అవసరం అనుకున్న ప్రతిసారి టిడిపి ఎమ్మెల్యేలను సభకు పంపించారు. అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురవుతోంది. మరోవైపు ఓ నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు అధినేత జగన్ వైఖరిపై ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాను హాజరు కాకుండా.. పార్టీ ఎమ్మెల్యేలను పంపిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.