Summer Health Tips Avoid Fried Foods: వెనకటి రోజుల్లో శారీరక శ్రమ అధికంగా ఉండేది. సుదూరమైతే తప్ప.. స్వల్పకాలిక దూరాలకు నడక లేదా సైకిల్ మీద వెళ్లేవాళ్లు. స్తోమత ఉన్నవాళ్లు ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారు. ఎక్కడో నగరాలు లేదా పట్టణాలలో కార్లు కనిపించేవి. నాటి కాలంలో కార్లను కూడా వింతగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. వంద మీటర్ల దూరానికి కూడా బైక్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైకిల్ తొక్కేవారు అరుదుగా కనిపిస్తున్నారు. ఇక నడవడాన్ని చాలామంది మర్చిపోయారు.
ముందుగానే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకునేవారు. తద్వారా అంతగా రోగాలు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు ఇంట్లో తినడం తగ్గింది. బయట తినడం పెరిగిపోయింది. పైగా ఆయిల్ ఫుడ్ అనేది నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆయిల్ ఫుడ్ అదే పనిగా తినడం వల్ల రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతుంటాయి. ఇవి దీర్ఘకాలంలో గుండెపోటు.. ఇతర వ్యాధులకు దారి తీస్తాయి. అందువల్ల నూనె పదార్థాలను మోతాదులో తీసుకోవాలి.. గుండె, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహాల మేరకు వాటిని తీసుకోవాలి.
ఇక ఎండాకాలంలో అధిక నూనె ఉంటే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని అదే పనిగా తీసుకోవడం వల్ల అలసట ఏర్పడుతుందని.. ఎసిడిటీ వంటి సమస్య వస్తుందని.. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. మిఠాయిలు.. ప్యాకేజ్డ్ పండ్ల రసాలు.. షుగర్ అధికంగా ఉండే శీతల పానీయాలు తాగకూడదని చెబుతున్నారు. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
ఎండాకాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. శరీరం నుంచి చెమట అధికంగా బయటికి వెళుతుంది. ఈ సమయంలో నీటి ద్వారా కోల్పోయిన లవణాలను శరీరంలో భర్తీ చేయాలి. అందువల్ల ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే మనలో చాలామందికి సాయంత్రం కాగానే ఏదో ఒక చిరు తిండి తినే అలవాటు ఉంటుంది. అందులో మిర్చీలు, పకోడీలు ఫస్ట్ ఛాయస్ గా ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావని వైద్యులు చెబుతున్నారు. స్టోరేజ్ చేసిన నూనెలో వీటిని తయారు చేయడం వల్ల.. అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. పదేపదే ఉపయోగించిన నూనె తో ఇటువంటి పదార్థాలను తయారు చేయడం వల్ల చెడు కొవ్వులు దేహంలో పెరిగిపోతాయని.. దీనివల్ల రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇంటి ఆహారాన్ని తీసుకోవాలని.. ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తినాలని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, కర్బుజ కాయలు, కీర దోస, దోస వంటి వాటిని తినాలని చెబుతున్నారు. మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు తీపి పండ్ల కు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ కొబ్బరి బొండాలు, కీర దోసకాయలు, పుచ్చకాయలు తినాలి అనుకునే మధుమేహ రోగులు వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంటుంది.