మన దేశంలో చాలామంది ప్రతిరోజూ అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే తినే అన్నంలో ఆర్సెనిక్ మూలకం మోతాదుకు మించి ఉంటే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఆర్సెనిక్ పదార్థం వల్ల క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సహజంగా తయారయ్యే మూలకాలలో ఒకటైన ఆర్సెనిక్ మట్టి, నీళ్లలో కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యూరోపియన్ యూనియన్ ఆరెన్సిక్ ను మొదటి కేటగిరీ క్యాన్సర్ కారకాల జాబితాలో చేర్చడంతో పాటు ఆర్సెనిక్ విషపూరితంగా మారుతుందని చెబుతున్నారు. ఒక కిలో మట్టిలో 100 ఎంజీ, లీటర్‌నీటిలో 10 యూజీల ఆర్సెనిక్ ఉండే అవకాశం ఉంటుంది. 2014 సంవత్సరంలోనే బియ్యంలో ఆర్సెనిక్ మూలకం గురించి గైడ్ లైన్స్ రిలీజయ్యాయి. ఇతర ఆహార ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో 20 శాతం ఎక్కువగా ఆర్సెనిక్ ఉంటుంది.
మట్టిలో నుంచి వరి ధాన్యంలోకి ఈ మూలకం సులువుగా చేరే అవకాశాలు అయితే ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుందని బాస్మతి బియ్యంలో ఆర్సెనిక్ తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నార్తర్న్ ఐర్లాండ్ బెల్‌ఫాస్ట్‌లో క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు బియ్యం చుట్టూ ఉండే పొట్టు ఆర్సెనిక్ కు కారణమని వెల్లడిస్తున్నారు. పాలిష్ చేయని ముడి బియ్యం తినవద్దని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు.
శరీరంలో ఆరెన్సిక్ మోతాదు మించితే రక్తవిరేచనాలు, కడుపు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్, హృద్రోగాలు, క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి శుభ్రమైన నీళ్లతో బాగా కడిగి వండితే ఆరెన్సిక్ స్థాయి తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు.